వనపర్తి, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానంగా అధికార కాంగ్రెస్లో బీఫాంల పంపిణీ విషయంలో గందరగోళం నెలకొన్నది. పార్టీ అభ్యర్థులను ప్రకటించడంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ముందంజలో ఉంది. జిల్లా కేంద్రంలో వనపర్తి బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు రోజుల కిందటే అధికారికంగా 29 మంది అభ్యర్థుల జాబితాను మీడియా సమావేశంలో ప్రకటించి ముందు వరుసలో నిలిచారు. అయితే, మిగిలిన నాలుగు స్థానాలకు మరుసటి రోజు ప్రకటించారు. ముందుగానే అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో ముందున్నారు. మూడురోజులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బీ ఫాంల కోసం ఎదురుచూస్తున్నారు.
నామినేషన్ల పర్వం ముగిసి మూడురోజులు గడుస్తున్నప్పటికీ అభ్యర్థుల అధికారిక ప్రకటన గానీ, బీఫాంల పంపిణీ కూడా లేకపోవడంతో ఆశావహులు గందరగోళానికి గురవుతున్నారు. రో జు వారీగా ప్రకటన చే స్తారని భావిస్తున్నా.. వాయిదాలు పడుతున్నాయి. తప్పనిసరి సోమవారం బీఫాంలు అందజేస్తారని, ఇందుకు కర్ణాటకకు చెందిన ఏఐసీసీ సెక్రటరీ, తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకుడు విశ్వనాథ్ పెరుమాల్తోపాటు మంత్రి శ్రీహరి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి సమక్షంలో పంపిణీ జరుగుతుందని ఆశించిన ఆశావహులంతా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే పైనాయకులందరూ మధ్యాహ్నం పార్టీ కార్యాలయానికి చేరుకున్నా బీఫాంల పంపిణీ మాత్రం జరగక పోగా మళ్లీ వాయిదా పడింది.
ఇలా అధికార పార్టీ ఎంపిక ఎడతెగడం లేదన్న అభిప్రాయం సొంత పార్టీ నాయకుల నుంచి వ్యక్తమవుతున్నది. కొన్ని వార్డుల్లో ఏకాభిప్రాయం లేకుండా అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని చివరి వరకు అ చితూచి అడుగులు వేస్తున్నట్లు భావిస్తున్నారు. అయి తే, ఓ నాయకుడు రెండువందలకు పైగా మహిళలతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి, పార్టీ కార్యాలయానికి వెళ్లి తన టికెట్ సమస్య తేల్చుకుంటానని వెళ్లడంతో వాయిదా వేసినట్లు సమాచారం. జిల్లాలో వనపర్తితోపాటు కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీల్లోనూ అభ్యర్థుల ప్రకటనలు, బీఫాంల పంపిణీ జరగకపోవడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. ఇక చివరి రోజు మంగళవారం మధ్యాహ్నం వరకు పార్టీల బీఫాంలను అభ్యర్థులు కార్యాలయాల్లో అందజేయాల్సి అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) యాదయ్య తెలిపారు.