రాజోళి, అక్టోబర్ 17: అమ్మాయి పెళ్లి భారం అనుకునే కుటుంబాలకు సీఎం కేసీఆర్ పెళ్లి కానుకతో ఆర్థిక భరోసా ఇస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తూ ఇంటికి పెద్దన్న పాత్రను పోషిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వివాహానికి రూ.1,00,116లు ఆర్థిక సాయం అందించి ఆడపిల్లల కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. మొదట ఈ పథకం 2014 అక్టోబర్ 2న ప్రవేశ పెట్టినప్పుడు రూ.51వేలు అందించే వారు. 2017 మార్చి 13న ప్రవేశ పెట్టిన 2017-18 తెలంగాణ బడ్జెట్లో రూ.51వేలను రూ.75,116లకు పెంచారు. అనంతరం 2018 మార్చి 19 నుంచి రూ.1,00,116 లకు పెంచారు. ఈ పథకంలో లబ్ధిపొందిన వారంతా సీఎం కేసీఆర్ను తమ ఇంటి మనిషిగా భావిస్తున్నారు. మా బాధలు తెలిసిన మనిషని గుండె లోతుల్లోంచి చెబుతున్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటున్న మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని అంటున్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారుల్లో 155 ఎస్సీ కుటుంబాలకు, 315 బీసీ ఈబీసీ కుటుంబాలు, 171 మైనారిటీ కుటుంబాలకు రూ.6కోట్ల 68లక్షల 77వేల 488లు అందజేశారు.
2022 మార్చి నుంచి అందజేత..
రాజోళి మండలంలో కల్యాణలక్ష్మి పథకం ద్వారా 102మంది, షాదీ ముబారక్ పథకం ద్వారా 11మంది లబ్ధిపొందారు. అలాగే వడ్డేపల్లి మండలంలో కల్యాణలక్ష్మి ద్వారా 69మంది, షాదీ ముబారక్ ద్వారా 20 మంది, ఇటిక్యాల మండలంలో కల్యాణలక్ష్మి ద్వారా 81మంది, షాదీ ముబారక్ ద్వారా 19మంది, అయిజ మండలంలో కల్యాణలక్ష్మి ద్వారా 123 మంది, షాదీ ముబారక్ ద్వారా 50 మంది, అలంపూర్ మండలంలో కల్యాణలక్ష్మి ద్వారా 66మంది, ఉండవల్లి మండలంలో కల్యాణలక్ష్మి ద్వారా 39 మంది, షాదీ ముబారక్ ద్వారా 27మంది, మానవపాడు మండలంలో కల్యాణలక్ష్మి పథకం ద్వారా 20 మంది, షాదీ ముబారక్ పథకం ద్వారా 44మంది లబ్ధిపొందారు.
సర్కారు సాయమే ఆదుకుంది..
నా కూతురు పెళ్లికి కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.1,00,116 చెక్కు మంజూరైంది. ఈ నగదు మా కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలిచింది. అప్పులపాలు కాకుండా అన్ని పనులు చేశాము. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆదుకున్న సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాము.
– నీలావతమ్మ, మాన్దొడ్డి
అప్పులపాలయ్యే వాళ్లం..
నా బిడ్డ పెళ్లి చేసిన తర్వాత కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.1,00,116 చెక్కు మంజూరైంది. ఈ డబ్బులతోనే బయటతీసుకున్న డబ్బులన్నీ చెల్లించాము. లేదంటే మేం అప్పులపాలయ్యే వాళ్లం. పెళ్లి ఖర్చుల గురించి ఆలోచించి, నాతో పాటు మాలాంటి వారిని ఆదుకుంటున్న కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం. ఆయనకే మా ఓటు.
– ఎం.మహేశ్వరి, రాజోళి