నాగర్‌కర్నూల్, ఆగస్టు 15 : రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పాలన సాగుతుందని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నాగర్‌కర్నూల్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ ఫలాలను విప్ వివరించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఉపాధి కార్యక్రమాలు చేపట్టిన మనం కలలుగన్న బంగారు తెలంగాణ దిశగా బలమైన అడుగులు వేస్తున్నామన్నారు. దళితబంధుకు చారకొండ మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి 1,407 కుటుంబాలకు రూ.140.70 కోట్లు అందజేశారన్నారు. 301 మందికి రూ.30.10కోట్ల ఆర్థికసాయం అందజేశామన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో రూ.3.50 కోట్లతో 175మందికి 2 పాడి గేదెలు పంపిణీ చేశామన్నారు. 198 మందికి 371 ఎకరాల 9 గుంటల భూమిని పంపిణీ చేశామని తెలిపారు. గృహలక్ష్మికి ఇప్పటి వరకు జిల్లా నుంచి 52,708 దరఖాస్తులు వచ్చాయన్నారు. రైతుబంధు కింద 2.88 లక్షల మంది ఖాతాల్లో రూ.3,521 కోట్లు, రైతుబీమా కింద 4,740 మంది నామినీల ఖాతాల్లో రూ.237 కోట్లు జమ చేశామన్నారు. ఈ వానకాలంలో 5.42 లక్షల ఎకరాల విస్తీర్ణంలో 1.29 లక్షల టన్నుల ఎరువులు కేటాయించామన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే 12.30 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందిస్తామన్నారు. మిషన్ భగీరథ ద్వారా 726 ఆవాసాలు, ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ 2024.9 కిలోమీటర్ల పైప్‌లైన్ వేసి తాగునీటిని అందిస్తున్నామన్నారు. పర్యాటకంలో భాగంగా రూ.10 కోట్లతో ఉమామహేశ్వరంలో అతిథిగృహాలు, రెస్టారెంట్లు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. మల్లెలతీర్థం జలపాతం వద్ద రూ.5కోట్లతో మెట్లు, రేలింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కలిగిస్తూ జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్న ప్రతి ఒక్కరికీ విప్ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధురాలు అంబటి లీలావతి సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందేశారు. వైద్య ఆరోగ్య, అటవీ, డీఆర్డీఏ, వెటర్నరీ శాఖల శకటాల నిర్వాహకులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి, కలెక్టర్ ఉదయ్‌కుమార్, అదనపు కలెక్టర్లు కుమార్‌దీపక్, సీతారామారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.