నాగర్‌కర్నూల్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ) : మద్యం నయా పాలసీకి రంగం సిద్ధమైంది. వచ్చే డిసెంబర్ 1వ తేదీ నుంచి సరికొత్తగా మద్యం వ్యాపారం జరగనున్నది. గత 2021నుంచి అమలవుతున్న రెండేళ్ల పాలసీ గడువు డిసెంబర్‌తో ముగుస్తోంది. దీంతో ముందస్తుగానే ప్రభుత్వం నూతనంగా వైన్ షాపుల టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు నిర్ణయించింది. దీంతో ఈనెల 4వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనుండగా 21వ తేదీన లక్కీడిప్ పద్ధతిన షాపుల కేటాయింపు జరగనుంది. ఈ సంవత్సరం చివర్లో అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఆ తర్వాతంతా పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశముది.
నేటి నుంచి టెండర్ల స్వీకరణ
నూతన మద్యం దుకాణాల టెండర్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసేందుకు నిర్ణయించింది. ఈనెల 4వ తేదీన రాష్ట్రంలో మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వా నిం చనున్నది. గత 2021లో ప్రారంభమై రెండేళ్ల పాటు అమ లులో ఉండే టెండర్ల గడువు డిసెంబర్‌తో ముగి యనుంది. కాగా ఈ సంవత్సరం చివర్లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే పరిస్థితు లు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం మూడు నెలల ముందుగానే టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం ముందుగా మద్యం దుకాణాలకు రిజర్వేషన్లు కేటాయించనున్నారు. గతంలో ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్రంలో నూ అమలు చేయని విధంగా 2021నుంచి మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ల విధానం అమలు పరుస్తోంది. ఇందులో గౌడలకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5శాతం చొప్పున దుకాణాల కేటాయింపు జరగనుంది. దీనికోసం గురువారం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాల వారీగా దుకాణాలకు రిజర్వేషన్లు కేటాయించారు. శుక్రవారం నోటిఫికేషన్ విడుదలతో పాటుగా దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు. ప్రభుత్వ పనిదినాల్లో ఈనెల 18వ తేదీ వరకు దరఖాస్తులను ఆయా జిల్లా కేంద్రాల్లోని ఎక్సైజ్ కార్యాలయాల్లో స్వీకరిస్తారు. గతంలో ఉన్న విధానాల ప్రకారమే దుకాణాలకు టెండర్ల ప్రక్రియ జరగనుంది.
రూ.2లక్షల నాన్ రీఫండబుల్ ఫీజుతో రిజర్వేషన్ల ప్రకారంగా వ్యాపారులు టెండర్లు దాఖలు చేయవచ్చు. ఒక్కరు ఎన్నైనా దరఖాస్తులు చేసేందుకు అవకాశం ఉంది. లైసెన్సు ఫీజులు పాత పద్ధతిలోనే ఉంచారు. జనాభాను బట్టి 5000లోపు ఉంటే రూ.50లక్షల ఫీజు, 50వేల వరకు రూ.55లక్షలు, లక్ష వరకు రూ.60లక్షలు, లక్ష నుంచి 5లక్షలలోపు జనాభాకు రూ.65లక్షల చొప్పున విధించడం గమనార్హం. ఒకరు ఒక దుకాణానికి ఎన్ని టెండైర్లెనా దాఖలు చేయవచ్చు. అయితే ప్రతి దరఖాస్తుకు మాత్రం రూ.2లక్షల నాన్ రీఫండబుల్ ఫీజును చలానా లేదా డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఎక్సైజ్ జిల్లా కార్యాలయంలో దాఖలు చేయాల్సి ఉంటుంది. లైసెన్సుదారులు వార్షిక పన్నును ఆరు వాయిదాల్లో రెండు నెలలకోసారి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు నాలుగో వంతు ఫీజును బ్యాంకు గ్యారెంటీ రూపంలో చెల్లించాలి. ప్రతి మద్యం దుకాణం వద్ద 3సీసీ కెమెరాలు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో మొదలు ఎంపీ, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకూ ఎన్నికలు జరగనున్నాయి. ఇలా ఇప్పుడు టెండర్లు దక్కించుకున్న వ్యాపారులకు ఎన్నికల వాతావరణం లక్కీ డ్రాప్లో కలిసిరానుంది. దీంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
రెండేళ్ల కిందట చేపట్టిన మద్యం వ్యాపార లైసెన్స్ డిసెంబర్‌తో ముగుస్తుంది. ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉండటంతో ముందస్తుగా ఈనెల 4న నోటిఫికేషన్ విడుదల అయింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో 67 దుకాణాలు ఉండగా ఎస్టీలకు 4, ఎస్సీలకు 9, గౌడలకు 9చొప్పున రిజర్వు అవుతాయి. మిగిలిన 22 దుకాణాలు జనరల్ కిందకు కేటాయించబడుతాయి. రిజర్వు దుకాణాలు గురువారం కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా తీయడం జరుగుతుంది. ఆసక్తి ఉన్న వ్యాపారులు ఈనెల 4వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఎక్సైజ్ జిల్లా కార్యాలయంలో టెండర్లను దాఖలు చేయవచ్చు.
-షేక్ ఫయాజుద్దీన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, నాగర్‌కర్నూల్