చారకొండ, జూన్ 8 : నల్లమట్టి వ్యాపారం అక్రమార్కులకు కాసుల పంట పండిస్తుంది. మండలంలోని ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నా క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రకృతి సంపద విధ్వంసమవుతున్నది. మండలంలోని సిరుసనగండ్ల, జూపల్లిలో పరిసరా ప్రాంతాల్లో చెరువులు, కుంటలపై అక్రమార్కుల కన్నుపడింది.
జూపల్లిలో చింత చెరువులో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రాత్రి, పట్టపగలు అనే తేడా లేకుండా జేసీబీ, ఎక్స్కవేటర్ల సహాయంతో గుట్టుచప్పుడు కాకుండా పదుల సంఖ్యలో టిప్పర్లు పెట్టి నల్లమట్టి తీసి ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న అక్రమార్కులు, ఏటా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమంగా నల్లమట్టి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
మండలంలోని జూపల్లి గ్రామ శివారులో చింత చెరువులో రెండురోజులుగా రాత్రి సమయాల్లో నల్లమట్టి తరలిస్తున్నారు. సోమవారం పట్టపగలే పదుల సంఖ్యలో టిప్పర్లతో నల్లమట్టి తరలిస్తున్న విషయం తెలుసుకున్న పరిసరా ప్రాంత రైతులు టిప్పర్లను అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టి తరలిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.
చెరువులో ఒండ్రు మట్టి తరలించడం వల్ల తమ వ్యవసాయ పొలాలకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని, రహదారులు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి మండలంలో అక్రమ మట్టి తరలింపును అడ్డుకట్ట వేయాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.