మిడ్జిల్ : మిడ్జిల్ మండల కేంద్రంలో దుందుభి వాగు పరిసర ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేనిచోట రాత్రి వేళల్లో ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఫిర్యాదులు అందిన సందర్భంలో తప్ప మిగిలిన సమయాల్లో అధికారులు ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించడంలేదనే విమర్శలున్నాయి.
రాజకీయ నాయకుల అండదండలున్న కొంతమంది నాయకులు దీనినే ప్రధాన వృత్తిగా పెట్టుకొని దందా సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. అప్పుడప్పుడూ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా.. ఏమాత్రం బెదరని మాఫియా యథేచ్ఛగా స్థానిక వాగుల నుంచి ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నది.
ఇంత జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పట్టపగలే అతివేగంతో ట్రాక్టర్లు రోడ్లపై ప్రయాణిస్తుంటే ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇసుక దందాకు అధికారులు సహకరిస్తున్నారని ప్రజలు బాహటంగానే చర్చించుకుంటున్నారు. జిల్లా అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని దుందుభి వాగు పరిసర ప్రాంతాల రైతులు కోరుతున్నారు.