కొల్లాపూర్, మే 30 : కొల్లాపూర్లో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. ప్రజాప్రతినిధులపై కూడా దౌర్జన్యం చేస్తోందని చర్చ నడుస్తోంది. ఎన్మన్బెట్ల వాగులో కొద్ది రోజులుగా జేసీబీలతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా.. సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే దందా జోరందుకున్నదని ఆరోపణలు లేకపోలేదు.
ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని, ఇసుక రవాణాను అడ్డుకోవాలని స్వయంగా గ్రామ సర్పంచ్ సింధూజ, బీఆర్ఎస్ నేత సురేందర్రావు శుక్ర, శనివారం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు పట్టించుకోకపోగా.. ఈ విషయం ఇసుక మాఫియాకు తెలియడంతో సదరు బీఆర్ఎస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. ‘తమకు మంత్రి అండగా ఉన్నారని.. ఇసుక తీసుకొని డబ్బులు సంపాదించుకోమని చెప్పారు’ అంటూ మాఫియా బెదిరింపులకు పాల్పడినట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అందుకే నిత్యం వందలాదిగా ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు అరికట్టాలని గ్రామ రైతులు, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.