ఊటూర్/ మా గనూరు, జూలై 10 : మాగనూరు పెద్ద వాగు వద్ద ఇసుక వివాదం రాజుకున్న ది. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథ కం పేరుతో రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఇసుక దోపిడీకి యత్నిస్తున్నది. మక్తల్ ని యోజకవర్గం భూత్పూర్ రిజర్వాయర్ నుంచి ఊటూర్, నా రాయణపేట, మద్దూర్, కొడంగల్ ప్రాంతాలకు సాగునీరు అందించే క్రమంలో కొడంగల్ లిఫ్ట్ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్ర మంలో మొదటి ప్యాకేజీ-1, ప్యాకేజీ-2 కింద పనులను విభజించి రూ. 24,000 కోట్ల అంచనా వ్యయంతో టెండ ర్ ప్రక్రియను పూర్తి చేసింది.
ఈ క్రమంలో ప్యాకేజీ-1 ద్వారా భూత్పూర్ రిజర్వాయర్ నుంచి ఊటూర్ పెద్ద చెరువుకు సాగునీరు అందించేందుకు పైప్‌లైన్, పంపుహౌస్ ని ర్మాణం పనులను రాఘవ కంపెనీ దక్కించుకున్నది ఈ నేపథ్యంలో మక్తల్ మండ లం కాచువార్ సమీపంలో ఓ రైతుకు సంబంధించిన వ్యవసాయ పొలాన్ని లీజుకు తీసుకొని సిమె ంట్ పైపుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కాట్రేవుపల్లి రెవెన్యూ పరిధిలో నిర్మించే పంప్‌హౌస్ నిర్మాణం కోసం అవసరమైన ఇసుకను మాగనూరు సమీపంలోని పెద్ద వాగు నుంచి అభివృద్ధి పేరుతో అక్రమంగా తరలించడంపై దృష్టి సారించింది. వాగులో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రోడ్డు మార్గం సైతం ఏర్పాటు చేసింది.
పెద్ద వాగు నుంచి ఇసుకను తరలిస్తే భవిష్యత్‌లో ఈ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉన్నదని, తాగు, సాగునీటికి ఇబ్బందులు తప్పవని మాగనూరు మండల వాసులు తరలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద వాగులోకి ఇసుక రవాణా కోసం వచ్చిన కంపెనీ వాహనాలను సైతం ఇప్పటికే పలుమార్లు గ్రామస్తులు మూకుమ్మడిగా అడ్డుకోవడంతో చేసేది లేక అధికారులు వాటిని వెనక్కి పంపించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ మంత్రి ఆదేశాలతో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం పెద్దవాగు నుంచి ఇసుక రవాణా సజావుగా కొనసాగేందుకు రాఘ వ కంపెనీ ప్రతినిధులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగే విధంగా ప్రవర్తిస్తే గ్రామస్తులపై చట్టపరంగా శిక్షలు విధిస్తామని పోలీసులు, అధికారులు హెచ్చరించినా స్థానిక ప్రజలు, రైతులు మాత్రం ససేమిరా అంటున్నారు. దీంతో చేసేది లేక వారిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇటీవల గ్రామస్తులతో తాసీల్దార్ కార్యాలయంలో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఇసుక రవాణాకు అడ్డుపడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులు, రైతులను హెచ్చరించారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్యాకేజీ-1 టెండర్ దకించుకున్న రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీప బంధువులకు చెందింది. దీంతో ఇసుక తరలింపునకు ఎలాంటి అనుమతులు లేకపోయినా మాగనూరు పెద్దవాగు నుంచి టిప్పర్ల ద్వారా తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నది. జిల్లా అధికార య ంత్రాంగం కూడా జీ..హుజూర్.. అం టూ తమపైనే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఇటీవల పెద్ద వాగును సందర్శించేందుకు వచ్చిన నారాయణపేట ఆర్డీవో రామచందర్‌తో గ్రామస్తులు తమ ఆవేదన వెల్లగక్కారు. పెద్ద వాగు శివారును ఆసరాగా చేసుకుని 300 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నామని, ఇసుకను తరలిస్తే భవిష్యత్తులో సాగునీటి సమస్య ఏర్పడి పంటలు పండేందుకు ఇబ్బందులు వస్తాయని రైతులు మొరపెట్టుకున్నారు. అలాగే పెద్ద వాగు కేంద్రంగా ఉన్న 8 బోరుబావుల సహాయంతో గ్రామానికి తాగునీటి సరఫరా జరుగుతుందని, అక్రమంగా ఇసుకను తరలిస్తే భూగర్భ జలాలు అడుగంటి గ్రామస్తులకు చుక నీరు అందే పరిస్థితి ఉండదని ఆందోళన చెందారు.
ఈ విషయంలో తాము ఏమాత్రం వెనకి తగ్గేది లేదని, ఒకవేళ గ్రామస్తులను కాదని అక్రమ ఇసుక రవాణాకు అధికారులు సహకరిస్తే తమ శవాలపై వాహనాలను తో లుకోవాలని అధికారులకు హెచ్చరించారు. పార్టీలకతీతంగా గ్రామంలో సమావేశం నిర్వహిం చి పెద్ద వా గు నుం చి ఇసుక రవాణాను అడ్డుకోవాలని తీర్మానం చేశారు. మాగనూరు పెద్ద వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణాను తరలిపోకుండా పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు సహకరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మక్తల్ నియోజకవర్గంలోని సంగంబండ రిజర్వాయర్ నుంచి పసుపుల వద్ద కృష్ణానది వరకు 26 కిలోమీటర్ల వరకు పెద్ద వాగు ప్రవాహం ఉన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాగనూరు, వరూర్, దాసర్‌దొడ్డి, అడవి సత్యారం శివారు పెద్దవాగు కేంద్రంగా ఆన్లైన్, టీజీఎంసీ ద్వారా ప్రభుత్వ నిబంధనలతో ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేసింది. ఇకడి నుంచి దూరం మేరకు ప్రభుత్వానికి నిర్ణీత రుసుం చెల్లించి ఇసుకను కొనుగోలు చేసేందుకు గత ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇసుక రవాణాకు సంబంధించి 4 ప్రభుత్వ రీచ్‌లు ఉన్నప్పటికీ మాగనూరు బ్రిడ్జి సమీపంలోని పెద్ద వాగు నుంచి ఇసుకను తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేందుకు రాఘవ కంపెనీ తన ప్రయత్నాలు మొదలుపెట్టిందని విమర్శలు వినిపిస్తున్నాయి.
మాగనూరు మండలంలో ఏర్పాటైన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇసుక తరలించాలని చూస్తున్న వాగు పరిసరాల్లోనే సర్వేనెంబర్ 418లో నాకు 8 ఎకరాల పొలం ఉన్నది. వాగు ప్రాంతంలో బోర్లు వేసుకొని పంటలు పండిస్తున్నాం. వానకాలమే సక్రమంగా పంటలకు సాగునీరు అందదు.. అలాంటిది ఎండాకాలం వస్తే సాగునీళ్లు అందక మా పంట పొలాలు ఎండుతాయి. ఈ పెద్దవాగును నమ్ముకొని మాగనూరు మండలంలో చాలా గ్రామాలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయి. ఇలా ఇసుక తరలించి రైతులకు సాగునీరు అందకుండా ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. అధికారులు మరోసారి ఆలోచించాలి. లేదంటే రైతులు దేనికైనా సిద్ధపడడం ఖాయం.
– బింగి తాయప్ప, రైతు, మాగనూరు, నారాయణపేట జిల్లా
పెద్ద వాగులో పారే సాగునీరే మాకు జీవనాధారం. వాగుకు సమీపంలోనే 420 సర్వే నెంబర్లో నాలుగెకరాల పొలం మా పొలం ఉన్నది. ఇది మొత్తం మాగనూరు పెద్దవాగు నీటిపై ఆధారపడి సాగు చేసుకుంటున్నాం. ఈ పెద్ద వాగులో ఇసుక కొడితే మాకు పంటల సాగుకు నీళ్లు అందక పంట పొలాలు ఎండుకుకుపోయే అవకాశం ఉన్నదని, ఎట్టి పరిస్థితుల్లో మాగనూరు బ్రిడ్జి దగ్గర ఉన్న వాగులో ఇసుక తరలించరాదు. ఇప్పటికే పలుమార్లు అనుమతి లేదన్న అధికారులే ఇప్పుడు ముందుండి కంపెనీకి ఇసుక తరలించాలని చెప్పడం ఎంతవరకు సమంజసం. ఇది ఇలాగే కొనసాగితే నాతోపాటు ఎందరికో జీవనాధారం కరువవుతుంది. నేను, నా కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది.. దయచేసి ఇసుక తరలింపును నిలిపివేయాలని చేతులు జోడించి అధికారులను వేడుకుంటున్నాను.
– బసవరాజ్, రైతు, మాగనూరు, నారాయణపేట జిల్లా