కల్వకుర్తి, జూలై 11 : దుందుభీ వాగును అధికార పార్టీకి చెందిన నాయకులు కొందరు చెరబట్టారు. భూగర్భ జలాలను కాపాడుతున్న ఇసుకపై కన్నేసిన నాయకులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని తోడేస్తున్నారు. వాగుకు ఇరువైపులా ఉన్న రైతులకు అండగా, ఆదెరువుగా ఉన్న దుందుభీ వాగు నడిబొడ్డున యంత్రాలను దింపి ఇసుకను కొల్లగొడుతున్నారు. చట్టాలు, నిబంధనలను తుంగలో తొక్కిన సదరు ఇసుకాసురులు తమకు అడ్డువచ్చిన వారిపై కన్నెర్ర చేస్తున్నారు. కాసుల ఆర్జనే పరమావధిగా భావిస్తున్న అక్రమార్కులు బంగా రం లాంటి ఇసుకను కొల్లగొట్టి యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఇంత బహిరంగంగా ఇసుక తీస్తు న్నా.. మైనింగ్, రెవెన్యూ, పెద్దన్న పాత్ర పోషించే పోలీసులకు కనబడకపోవడం విశేషం. ఇదంతా సీఎం రేవంత్‌రెడ్డి సొంత మండలం వంగూరులో వ్యాపారం జోరుగా సాగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి.
నాగర్‌కర్నూల్ జిల్లా వంగూర్ మండలం పోతారెడ్డిపల్లికి సరిగ్గా కిలోమీటరు దూరంలో దుందుభీ వాగులో ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారు. నడివాగు వరకు దర్జాగా రోడ్డు వేసుకొని పెద్ద పెద్ద యంత్రాలతో ఇసుకను తీస్తున్నారు. పెద్ద పెద్ద హిటాచీలు, ఇసుక టిప్పర్లతో వాగు రణరంగంలా మారిపోయింది. ఒక్కో టిప్పర్‌లో 40నుంచి 50 టన్నుల ఇసుక వేసి తరలిస్తున్నారు. వాగులో నీరు దిగువకు వెళ్లేలా కాలువ ఏర్పాటు చేసి ఇసుకను పెద్ద పెద్ద కుప్పలుగా పోస్తున్నారు.
రెండు పెద్ద జేసీబీలు (200) ఇసుకను టిప్పర్లలో నింపుతున్నా యి. రాత్రి, పగలు అని తేడాలేకుండా ఇసుక దం దాను కొనసాగిస్తున్నారు. మీడియాలో వార్తలు రాగానే వారం, పది రోజుల పాటు స్తబ్ధుగా ఉండే అక్రమార్కులు కాస్త సందు దొరకగానే తమ కుటిల బుద్ధికి పదును పెడతారు. పోతారెడ్డిపల్లి వద్ద గత వారం రోజులుగా పెద్ద ఎత్తున్న తీస్తు న్నా.. బయటి ప్రపంచానికి తెలియలేదంటే.. ఏ స్థాయిలో వారు వ్యాపారం చేస్తున్నారో సులువుగా అర్థమవుతుంది.
అభివృద్ధి పనులకు ఇసుక కావాలి కనుక.. ప్రభుత్వ అనుమతులతోనే ఇసుకను తీస్తున్నామని ఇసుక అక్రమార్కులు చెబుతుంటారు. అక్రమార్కులే సొంతంగా అనుమతి పత్రాలు తయా రు చేసుకునేంత రాటుదేలిపోయారు. ప్రధానంగా కల్వకుర్తి మండలం, ఉప్పునుంతల మండలం, వంగూర్ మండలాల పరిధిలోని దుందుభీ వాగులో ఈ ఇసుకను తీస్తున్నారు. ఇసుక లభ్యత ఎక్కువగా కల్వకుర్తి మండలం గుండూర్, లింగసానిపల్లి, రఘుపతిపేట, ఉప్పునుంతల మండ లం దాసర్లపల్లి, వంగూర్ మండలం పోతారెడ్డిపల్లి, ఉల్పర, జాజాల వద్ద ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్రమార్కుల దృష్టి అక్కడ పడింది. ఏదో ఒక అభివృద్ధి పనికి ఇసుక అవసరమైతే.. దీనికి సదరు అక్రమార్కులు పెద్ద స్కెచ్ వేస్తారు. 100 క్యూబిక్ మీటర్ల ఇసుకకు అనుమతి ఉంటే లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుక కొల్లగొడతారు.
ఒక్కోసారి ఎలాంటి అనుమతులు లేకుండా కేవలం అనుమతులు ఉన్నాయనే ముసుగులో అక్రమంగా ఇసుకను తోడేస్తారు. వీరి తెలివి ఎంతగా ఉంటుందంటే.. టిప్పర్లను ఎవరూ అడ్డుకోకుండా టిప్పర్ల అద్దానికి నకిలీ అనుమతి కాగితాలను అంటిస్తారు. వీటిని చూసి సహజంగానే అనుమతి ఉందని భా వించడానికి. కల్వకుర్తిలో కొందరు ఔత్సాహికులు టిప్పర్ ఆపి అనుమతి పత్రాన్ని దగ్గర నుంచి పరిశీలించడానికి యత్నిస్తే.. సదరు టిప్పర్ డ్రైవర్ నకి లీ పత్రాన్ని చింపివేశారు. ఆ తర్వాత సదరు లారీ ని పోలీసులకు అప్పగించారు అది వేరే సంగతి.
దుందుభీ వాగు ఎక్కడో అడవిలో ప్రవహించడం లేదు. వాగుకు ఇరువైపులా గ్రామాలు, పచ్చటి పైరులు ఉంటాయి. కిలో మీటరు దూరం నుంచి చూసినా వాగులో నీళ్ల పరవళ్లు కనిపిస్తుంటాయి. రైతుల సంచారం కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. కల్వకుర్తి నియోజకవర్గానికి దాదాపు 25 కిలో మీటర్ల లోపే వాగు ఉంటుంది. వాగునుంచి ఇసుకను తీసుకువచ్చే టిప్పర్లు రోడ్డపైనే భారీ శబ్ధంతోనే తిరుగుతుంటాయి. అయినా ఏ డిపార్ట్మెం ట్ అధికారికి కూడా ఈ దురాగతాలు ఎందుకు కనబడవో తెలియడం లేదు. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో డీఎస్పీ, ఆర్టీవో కార్యాలయాలతోపాటు రెండు పోలీస్ సర్కిల్స్, ఐదు పోలీస్ స్టేషన్లు, ఐదు తాసీల్దార్ కార్యాలయాలు ఉన్నా యి. ఇంత పటిష్టమైన అధికార యంత్రాంగం ఉన్నప్పటికీ ఇసుక అక్రమ రవాణా సజావుగా సాగడానికి కారణమేమిటని సామాన్యుడిని వేధిస్తున్న ప్రశ్న.
వంగూర్ మండంలోని పోతారెడ్డిపల్లి గ్రామం వద్ద మన ఇసుక వాహనానికి మాత్రం ఇసుక రీచ్‌ను గుర్తించాం. అక్కడ నుంచి మన ఇసుక వాహనాలు( ట్రాక్టర్లు) ఇసుక తీసుకుని వెళ్తాయి. మరే ఇసుక రీచ్‌ను గుర్తించలేదు. వారికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఈ మధ్యనే కొత్తగా వచ్చాను. మాకు స్టాఫ్ తక్కువగా ఉన్న నేపథ్యంలో రెవెన్యూ అధికారుల సహకారం తీసుకుంటున్నాం. అనుమతి లేకుండా ఇసుకను కొల్లగొడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మైనింగ్‌శాఖ ఏడీ హరికృష్ణ హెచ్చరించారు.
రక్తం రుచి మరిగిన పులిలాగా.. అధికార పార్టీలో కొందరు నాయకులు ఇసుక వ్యాపారం రుచి మరిగారు. ప్రభుత్వానికి తూతూ మంత్రంగా సీనరీజ్ చార్టీలు చెల్లించి పెద్ద ఎత్తున ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఏదో ఒక అనుమతి ముసుగు వేసి ఇసుకను తరలిస్తున్నా రు. అసలు విషయానికి వస్తే.. ప్రభుత్వానికి సంబంధించి పెద్దపెద్ద అభివృద్ధి పనులకు టెండర్ పిలిస్తే.. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయాలి. అతనికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం డబ్బు చెల్లిస్తుంది. ఇసుక, సిమెంట్, స్టీల్ తదితర వాటిని కాంట్రాక్టర్ సమకూర్చుకోవాలి. దీనికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదనేదీ డీపీఆర్‌లో స్పష్టంగా ఉంటుంది.
అయినప్పటికీ కొందరు అక్రమార్కులు అభివృద్ధి పనుల కోసం అంటూ కొత్త నాటకాలు ఆడుతూ ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు. నిజంగా కాంట్రాక్టర్‌కు ఇసుక అవసరమైతే.. ప్రభుత్వ అభివృద్ధి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ తనకు ఎంత ఇసుక అవసరం అవుతుందో తన వద్ద ఉన్న డీపీఆర్‌ను జతపరిచి మైనింగ్ శాఖకు దరఖాస్తు చేసుకుంటారు. ఆ తర్వాత కలెక్టర్ స్థాయిలో సమీక్ష నిర్వహించి అనుమతులు ఇస్తారు. ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుక తీసుకుంటాడో అందుకు సంబంధించి సదరు కాంట్రాక్టర్ సీనరీజ్, బెటర్మెంట్ చార్టీలు చెల్లిస్తాడు. అనుమతి పొందిన ఇసుకకు సంబంధించిన వే బిల్లులు తీసుకుంటాడు. ఇంత పెద్ద తతంగం ఉండగా తాడు బొంగరం లేని అక్రమార్కులు ఊరికనే అనుమతులు ఉన్నాయని అందరి చెవుల్లో పూలు పెడుతుంటారు.
దుందుభీ వాగు చుట్టుపక్కల గ్రామాల రైతులకు వాగు పెద్ద దిక్కు. వాగుకు వరద వస్తే.. చుట్టు పక్కల గ్రామాల రైతులకు పండుగనే. భూగర్భ జలాలు ఉబికి వస్తాయి. వాగులో నీరు లేకపోయినా.. వాగులో ఉన్న ఇసుక కింద నీళ్లు ఉంటాయి. ఆ నీరే వర్షాలు అటుఇటు అయినా.. రైతులకు శ్రీరామ రక్షగా ఉంటుంది. అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు చూపుతో దుందుభీ వాగులో కోట్లాది రూపాయలు వెచ్చించి చెక్‌డ్యాంలు నిర్మించింది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఇసుకను ఆదాయ వనరుగా చూస్తున్నారు. రైతుల గురించి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు మూటగట్టుకుంటున్నారు. ఇదే విధంగా ఇసుకను కొల్లగొడితే.. రైతులకు మరణ శాసనమేనని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.