గద్వాల, జనవరి 12 : జిల్లాలో సీఎంఆర్ పేరిట కొందరు మిల్లర్లు అక్రమ దందాకు పాల్పడుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం కోట్ల విలువ చేసే ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చి మర ఆడించి ఇవ్వాలని ఇస్తే ప్రభుత్వానికి బియ్యం ఇవ్వడంలో మిల్లర్లు జాప్యం చేస్తున్నా ఎవరూ అడిగే దిక్కు లేదు. దీంతో కొందరి సివిల్ సప్లయ్ అధికారుల సహాయంతో కోట్ల విలువ చేసే ధాన్యాన్ని మిల్లర్లు బయటకు అమ్ముకొని ప్రభుత్వానికి అందాల్సిన బియ్యాన్ని ఎగ్గొడుతున్నారు. అధికారులు ఒత్తిడి చేసిన సమయంలో డీలర్ల వద్ద పీడీఎస్ బియ్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసి దానిని రీసైక్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి ఇస్తున్నారు.
ఇది తెలిసిన అధికారులు మిల్లర్లు ఇచ్చే లంచాలకు ఆశపడి వాటిని పాస్ చేస్తున్నారు. 2021-22 యాసంగికి సంబంధించి రూ.20కోట్లకు పైగా విలువైన ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వకుండా దోచేయడం సంచలనంగా మారడంతోపాటు దీనిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని మంత్రి జూపల్లి అధికారులను ఆదేశించినా ఇప్పటి వరకు విచారణ అతీగతి లేకపోవడంతో మిల్లర్లు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతున్నది. మిల్లర్లు 2023-24 సంవత్సరం యాసంగికి సంబంధించి ప్రభుత్వం నుంచి ధాన్యాన్ని తీసుకున్నా ప్రభుత్వానికి ఇవ్వడంలో మిల్లర్లు జాప్యం చేస్తున్నారు. వీటన్నింటిపై రాష్ట్రస్థాయి విజిలెన్స్ అధికారులు జిల్లాలోని అన్ని మిల్లులపై ఆకస్మికంగా దాడులు నిర్వహిస్తే తప్పా అసలు నిజాలు బయటపడే అవకాశం లేదు.
కాలయాపన చేస్తున్న మిల్లర్లు..
ప్రభుత్వానికి అందించాల్సిన బియ్యం ఇవ్వకుండా కొంత మంది మిల్లర్లు కాలయాపన చేస్తున్నారు. బీచుపల్లిలోని సాయిశ్రీ ట్రేడింగ్ కంపెనీ ప్రభుత్వానికి మొత్తం 111.528 ఏసీకేల బియ్యం ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 65 ఏసీకేలు మాత్రమే ప్రభుత్వానికి అందించింది. ఇంకా 46.53 ఏసీకేల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. కొండపల్లి రోడ్డులోని మణికంఠ రైస్ ఇండస్ట్రీ 104.936 ఏసీకేల బియ్యం ఇవ్వాల్సి ఉండగా, 60 ఏసీకేల బియ్యం ఇచ్చారు. ఇంకా పెండింగ్‌లో 36.48 ఏసీకేలు ఉన్నాయి. జోగుళాంబ రైస్‌మిల్లు బుక్కాపురం రోడ్డు మిల్లు నుంచి ప్రభుత్వానికి 5.898 ఏసీకేలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఒక్క ఏసీకే బియ్యాన్ని కూడా ప్రభుత్వానికి ఇవ్వలేదు.
అలాగే లక్ష్మీవేంకటేశ్వర మోడ్రన్ రైస్‌మిల్ (దువాసిపల్లి) నుంచి ప్రభుత్వానికి 14.009 ఏసీకేల బియ్యం ఇవ్వాల్సి ఉండగా, కేవలం రెండు ఏసీకేల బియ్యం మాత్రమే అందించారు. ఇంకా ఆ మిల్లు నుంచి 12.01 ఏసీకేల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉన్నది. కేటిదొడ్డి మండలంలోని కమ్మిడిస్వామి రైస్‌మిల్ యజమాని 48.108 ఏసీకేల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 6ఏసీకేల బియ్యం మాత్రమే ఇవ్వగా 42.11 ఏసీకేల బియ్యం పెండింగ్‌లో ఉంచారు. ఈ మిల్లును బ్లాక్ లిస్ట్‌లో పెట్టినప్పటికీ అధికారులు సీఎంఆర్ వడ్లు కేటాయించడం వెనుక మర్మం ఏమిటో అర్థం కావడం లేదు. దీంతోపాటు మూడు రోజుల కిందట దూవాసిపల్లి శివారులో ఉన్న రైస్ మిల్లు సమీపంలో విజిలెన్స్ అధికారులు 153 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు.
బీచుపల్లి ఆయిల్ మిల్లులో దొంగలు పడి ధాన్యం ఎత్తుక పోయారని ఫిర్యాదు చేసిన మిల్లు యజమాని కూడా ప్రభుత్వానికి బియ్యం అందించాల్సి ఉంది. దొంగలు పడి ధాన్యం ఎత్తుకెళ్లారనేది కట్టు కథ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వీరు ప్రభుత్వం కేటాయించిన వరి ధాన్యం అమ్ముకుని పీడీఎస్ బియ్యాన్ని సీఎంఆర్‌గా మార్చే క్రమంలో విజిలెన్స్ అధికారులకు దొరికినట్లు తెలిసింది. ఏడు మిల్లులకు గత యాసంగిలో ప్రభుత్వం ధాన్యం కేటాయించగా, అందులో రెండు మిల్లులు మాత్రమే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో బియ్యం అందించగా, మిగతా ఐదు మిల్లుల నుంచి 161.456 ఏసీకేల బియ్యం రావాల్సి ఉంది. ఈ మిల్లులపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Rice
బియ్యం ఇవ్వని మిల్లులపై ప్రజాప్రతినిధి ఫిర్యాదు..
ప్రభుత్వం నుంచి వరిధాన్యం తీసుకొని ప్రభుత్వానికి బియ్యం సరఫరా చేయని మిల్లులపై జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి రాష్ట్ర సివిల్ సప్లయ్ అధికారులతోపాటు, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. రాష్ట్రస్థాయి విజిలెన్స్ అధికారు లు పూర్తిస్థాయిలో విచారణ చేస్తే తప్పా అసలు విషయాలు బయట పడే అవకాశం లేదు.
2023-24లో 19,138 మెట్రిక్ టన్నులు కేటాయింపు..
2023-24 యాసంగికి సంబంధించి జిల్లాలోని ఏడు రైస్ మిల్లులకు 19,138 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం మిల్లర్లకు కేటాయించింది. దీని విలువ సుమారు రూ.45కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. ఇందుకు సంబంధించి 447.456 ఏసీకేల సీఎంఆర్ బియ్యం ప్రభుత్వానికి అందించాల్సి ఉండగా, జనవరి 3వ తేదీ వరకు కేవలం 286 ఏసీకేల సీఎంఆర్ అందించగా, మిగిలిన బియ్యం మిల్లర్లు అందించకుండా కాలయాపన చేస్తున్నారు. ఇంకా మిల్లర్లు 161.456 ఏసీకేల బియ్యం ప్రభుత్వానికి అందించాల్సి ఉంది.
రూ.20కోట్లకు పైగా ధాన్యం కుంభకోణం..
జోగుళాంబ గద్వాల జిల్లాలో 2021-22 యా సంగికి సంబంధించి సుమారు రూ.20కోట్లకు పైగా ధాన్యం పక్కదారి పట్టడంతో ఇది అప్పట్లో సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించి మిల్లర్లపై అధికారులు కేసులు నమోదు చేసి వదిలేశారు. ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకుండా లూటీ చేసిన మిల్లులో గద్వాల మండలం కాకులారంలోని శ్రీకృష్ణా రైస్‌మిల్లు, శాంతినగర్‌లోని సూర్యరైస్ మిల్లు, అయిజలోని అన్నపూర్ణ రైస్ మిల్లులు ఉన్నాయి. ధాన్యం కుంభకోణంలో చోటుచేసుకున్న అవినీతిపై అప్పటి సివిల్ సప్లయ్ డీఎం ప్రసాద్‌రావు ఫిర్యాదు చేయగా, ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసి నాలుగేండ్లు కావస్తున్నా ధాన్యం అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే మిల్లర్లపై ఆర్ఆర్ యాక్టుకింద ఆస్తులు జప్తు చేయాల్సి ఉండగా, అధికారులు అలా చేయకుండా మిల్లర్లకు కొమ్ము కాశారనే ఆరోపణలు బ లంగా వినిపిస్తున్నాయి. ఇదే అదునుగా చూసుకొని 2023-24లో అ దే దందా కొనసాగించే పనిలో మిల్లర్లు ఉన్నారు.