పాలమూరు, అక్టోబర్ 20 : బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తుండడం తో ప్రజలు బీఆర్ఎస్ను విశ్వసిస్తున్నారన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బీకే రెడ్డి కాలనీలో శుక్రవారం బీజేపీ, కాంగ్రెస్‌లకు చెందిన నాయకులు అంబుజాదేవి, శాంతమ్మ, రాధ, మాధవి, పుష్ప, బుగ్గప్ప, శేఖ ర్, నరేశ్, ఉదయ్, వెంకటేశ్, అమర్, వీరేశ్, ప్రశాంత్, సమీర్, ఫైజాన్, తన్వీర్తోసహా సుమారు 100 మంది మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెల్ల రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి రైతుబీమా తరహాలో కేసీఆర్ బీమా అమలుచేస్తామన్నారు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చాడంటే తప్పకుండా నెరవేరుతుందన్న నమ్మకం ప్రజలకు ఉందన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన పేద మహిళలకు ప్రతి నెలా రూ.3 వేల భృతి చెల్లిస్తామన్నారు. రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. రైతుబంధును దశల వారీగా రూ.16వేలకు పెంచుతామన్నారు. పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల నుంచి పేదలకు ఉపశమనం కల్పించేందుకు అర్హులైన వారికి రూ.400కు అందిస్తామన్నారు. అగ్రవర్ణ పేదల కోసం గురుకులాలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజాశీర్వాదంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధిస్తామని దీమా వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు మాత్రమే కనబడే నాయకులు, రెచ్చగొట్టి ఓట్లు రాబట్టాలని ప్రయత్నించే వారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కులమతాలు, గొడవలతో ఎన్నికల్లో గెలవాలనే కుట్రలు పన్నుతున్నారన్నారు. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచే గాయబ్ అయ్యేవారు ఈ ప్రాంతానికి, ప్రజలకు ఏం సేవ చేస్తారన్నారు.
జిల్లా కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ ఆలయం, బీకే రెడ్డి కాలనీలోని రెడ్డి హాస్టల్ వద్ద, న్యూప్రేమ్ నగర్లో, రైల్వేస్టేషన్ వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన కనకదుర్గ అమ్మవారికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో మహబూబ్‌నగర్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఆయా కార్యక్రమాల్లో కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.