పెద్దకొత్తపల్లి, జనవరి 8 : ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఆటోను ఢీ కొట్టగా భార్యాభర్తలు అకడికకడే మృతి చెందిన ఘటన పెద్దకొత్తపల్లి మండలం వావిళ్లబావి స్టేజీ సమీపంలో సోమవారం చోటుచేసుకున్నది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్-2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ వైపు వెళ్తుండగా పెద్దకొత్తపల్లి నుంచి స్వగ్రామం చంద్రకల్ గ్రామానికి వస్తున్న మినీ ట్రాలీ ఆటోను ఆర్టీసీ బస్సు వేగంగా ఢీ కొట్టింది.
దీంతో ఆటో నుజ్జునుజ్జవ్వగా, ఆటో నడుపుతున్న హుస్సేన్(35), అతని భార్య హసీనా(28) అకడికకడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నాగర్కర్నూల్ జనరల్ దవాఖానకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు. మృతులు గ్రామాల్లో పాత ఇనుప సామాన్లు కొనుగోలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు.