జడ్చర్లటౌన్, అక్టోబర్ 16 : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటగా ఈనెల 18వ తేదీన జడ్చర్లలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు అన్ని విధాల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ సభాస్థలి వద్ద ఏర్పాట్లు చేపట్టారు. విశాలమైన వేదికతో గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీ, మీడియా గ్యాలరీలతోపాటు ప్రజాప్రతినిధులు, కార్యకర్తల కోసం గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సీఎం కేసీఆర్ సభకు ప్రజలు పెద్ద ఎత్తున్న తరలిరానున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సభస్థలికి కొద్దిదూరంలోనే హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన పనులు త్వరితగతిన జరుగుతున్నాయి.
అదేవిధంగా సీఎం కేసీఆర్ జడ్చర్ల వేదికగా ఎన్నికల ప్రచారం మొదలెట్టనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ సభకు భారీ జనసమీకరణ తరలించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమావేశాలు నిర్వహించి సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దాదాపు లక్షకు పైగా జనం సీఎం కేసీఆర్ సభకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లను గావించడంలో నిమగ్నమయ్యారు.