మహబూబ్నగర్, డిసెంబర్ 28 : నాలుగేండ్లుగా బదిలీల కోసం హోంగార్డులు ఎదురుచూస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులకు తోడు దూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తూ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. ఉ మ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 800 మందికిపైగా హోంగార్డులు విధి నిర్వహణ కోసం ఇతర ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగిస్తూ అవస్థలు పడుతున్నారు. 2021లో అప్పటి మహబూబ్నగర్ ఉమ్మ డి జిల్లా నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐదు జిల్లాల్లోని అన్ని పోలీస్స్టేషన్లకు.. ఎస్పీ కార్యాలయాలకు వీరిని బదిలీలు చేశారు. నాటి నుంచి వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు.
మహబూబ్నగర్ నుంచి కూడా ఎంతోమంది హోంగార్డులు వివిధ జిల్లాలు.. మండలాలకు వెళ్లి డ్యూటీలు కొనసాగిస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత సొంత జిల్లాలో ఉన్న ఏఎస్సైలు అదే జిల్లాలోనే.. పక్క మండలాల్లోనే విధులు నిర్వర్తిస్తున్నా పరిస్థితి ఉన్నది. కానీ హోంగార్డులకు మాత్రం దూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నామని, బదిలీలు చేయాలని పలుమార్లు ఎస్పీల ఎదుట గోడు వెల్లబోసుకున్న సంఘటనలు ఉన్నాయి. దీనికితోడు నాలుగేండ్లు గా కళ్లుకాయలు కాసేలా బదిలీల కోసం నిరీక్షిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం వేతనాలు పెంచినా.. లివింగ్ కాస్ట్ విపరీతంగా పెరగడంతో జీతం సరిపోక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇప్పటికైనాబదిలీలు జరుగుతాయోమోనని ఆశతో ఉన్నారు.
ఒకనాడు హోంగార్డులు అంటే పోలీస్ అధికారులకు సేవకులుగా భావించేవారు. ఇంటిపని, వంటపని.. ఇలా అన్నీ వారితోనే చేయించుకునేటోళ్లు.. ఇచ్చే అరకొర జీతానికి వెట్టిచాకిరీ చేయించేవారు.. ఒక రకంగా చెప్పాలంటే తోటమాలిగానో, ఇంట్లో వంట మనిషిగానో.. ఇంటి పను లు చూసుకునే విధంగా పనిచేయించుకునే వారు.. దినసరి వేతనం కావడంతో ఏ రోజైనా డ్యూటీకి హాజరుకాకపోతే కట్ చేసేవారు. పనిచేసి న దినాలను లెక్కించి జీతం ఇచ్చేవారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వారి సేవలను గుర్తించింది.
నెలకు రూ. 12 వేలకు జీతం పెంచారు. తర్వాత 2018లో ఒకేసారి రూ.20 వేలు పెంచడంతో వారికి గౌరవం లభించింది. పెరిగిన జీతంతో పాటు ప్రతి సంవత్సరం రూ.వెయ్యి ఇంక్రిమెంట్ ఇస్తామని ప్రకటించింది. అన్నట్లుగానే మూడేళ్ల పాటు వెయ్యి రూపాయాల
చొప్పున నాటి ప్రభుత్వం జీతం పెంచింది. 2021లో పీఆర్సీ ప్రకారం 30 శాతం పెంచుతామని ప్రకటించి, కొంత మేరకు అమలు చేయడంతో వారి జీతం రూ.27 వేలకు చేరింది. అప్పటి నుంచి అ దే వేతనం కొనసాగుతుంది. ప్రస్తుత ప్ర భుత్వం హోంగార్డుల సమస్యలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
‘పోలీసు శాఖలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే హోంగార్డులకు శ్రమకు తగ్గ జీతం లేదు.. వారిని అక్కున చేర్చుకుంటాం.. వంద రోజుల్లో అధికారంలోకి వస్తున్నాం’.. అంటూ 2023 ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోనూ అన్ని సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామని పొందుపర్చాలని డిమాండ్ చేశారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాదైనా కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదన్న ఆవేదన వారిలో మిగిలింది. అరకొర వేతనాలు కూడా సకాలంలో రాక అప్పుల్లో కూరుకుపోతున్నామని పలువురు వాపోయారు. వచ్చే జీతంతో సగం వరకు బందోబస్తులు, పెట్రోల్, ఇతర అవసరాలకే సరిపోతున్నాయని వాపోయారు. నెలవారి మెయింటనెన్స్, రూ.వేలల్లో.. ఇంట్లో ఖర్చులు ఉంటున్నాయి. మా పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, ఖర్చులతో కుటుంబ పోషణ రోజురోజుకూ భారమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి.
నాలుగేండ్ల నుంచి మాకు బదిలీలు లేవు.. కుటుంబాలకు దూరంగా చాలా మంది హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. బదిలీలు అప్పుడు.. ఇప్పుడు అంటూ అధికారులు వాయిదా వేస్తున్నారు. నెల వేతనం కూడా టైంకు రావడం లేదు. దీంతో కుటుంబ పోషణ భారమై చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇప్పటికైనా బదిలీలు చేపట్టాలి.
– ఓ హోంగార్డు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా