నాగర్‌కర్నూల్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో అధికారులు తలమునకలయ్యారు. ఈనెల 9వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించే కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఓటింగ్ నమోదు ప్రక్రియ పూర్తికాగా కొత్త ఓటర్లను చేర్పించే ప్రక్రియనూ యథావిధిగా కొనసాగించనున్నారు. ఇప్పటికే బీఎల్వోలకు దిశానిర్దేశనం చేయడం జరిగింది. ఇక కోడ్ అమలులోకి రావడంతో రాజకీయ పార్టీలకు అవగాహన కల్పించేలా ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోడ్ సందర్భంగా ఆయా పార్టీలు ప్రచారం చేసుకోవడం, అనుమతులు తీసుకోవడం, సమస్యలపై ఎలా ఫిర్యాదులు చేయాలి, సభలు నిర్వహించుకోవడంపై అవగాహన కల్పిస్తున్నారు.
ఎన్నికల నామినేషన్ నుంచి ప్రచారం వరకు రాజకీయ పార్టీలు కోడ్ అమలు చేస్తే ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉంచేలా ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల నాయకులకు ప్రత్యేకంగా వివరించే చర్యలు చేపట్టడం గమనార్హం. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ కూడా పూర్తికాగా టాయిలెట్ల్లు, విద్యుత్, తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. ఎన్నికల్లో మద్యం, డబ్బుల పంపిణీని అరికట్టేదుకు మరింత గట్టి చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ విషయమై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో అంతర్రాష్ట్ర, అంతర్జిల్లా, నియోజకవర్గస్థాయిలో చెక్‌పోస్టుల్లో 24గంటల పాటూ తనిఖీలు కొనసాగించనున్నారు. రూ.50వేలు దాటితే, ఆన్లైన్లో రూ.లక్ష వ్యవహారాలపై నిఘా ఉంచనున్నారు. ఈ లావాదేవీలపై తమకు వివరాలు అందించాలని కలెక్టర్ ఇప్పటికే బ్యాంకర్లను సైతం ఆదేశించారు.
ఇక చెక్‌పోస్టుల్లో పట్టుబడ్డ నగదు, బంగారంపై తగిన ఆధారాలు చూపిస్తే తిరిగి అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మద్యం కూడా నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తే వాహనాలను సీజ్ చేయడంతోపాటుగా సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయనున్నారు. పోలీసు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో వ్యవహరించేలా సూచించారు. ప్రతిరోజూ ఉదయం 9గంటల్లోపు జిల్లా ఎన్నికల అధికారులకు ఆయా రోజుల్లో జరిగిన వివరాలపై పూర్తిస్థాయిలో నివేదికలు అందించనున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఫ్లయింగ్ స్కాడ్లు, వీడియో సర్వేలైన్ బృందాలు, అకౌంటింగ్ బృందాలు, మానిటరింగ్ కమిటీల నియామకాలను కూడా పూర్తి చేశారు. ఎన్నికల కోడ్ అమలులో వచ్చే ఫిర్యాదులు, ఆయా పార్టీలకు ఇచ్చే అనుమతులపై పారదర్శకంగా వ్యవహరించేలా ఆదేశించడం జరిగింది.
ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్లో 24గంటల పాటు అమలులో ఉండేలా కాల్‌సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక 80 ఏండ్ల్లు దాటిన సీనియర్ సిటిజన్లు ఇంటి నుంచే ఓటు వేసేలా ఏర్పాట్లు చేయడంతో బీఎల్వోల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. అలాగే యువకులకు, మహిళలకు మోడల్ పోలింగ్ స్టేషన్లనూ ఏర్పాటు చేయనున్నారు. కోడ్ అమలులోకి వచ్చిన రోజునుంచే గ్రామాలు, పట్టణాల్లో ఆయా రాజకీయ పార్టీలు, నాయకుల పేరుతో వెలిసిన పోస్టర్లు, ఫ్లెక్సీలు, పార్టీల జెండాలు తొలగించడంతోపాటు వాల్ రైటింగ్స్‌ను కూడా పూర్తిగా తుడి వేయడం, వాటిని సున్నాలు వేయడం లాంటివి చేయిస్తున్నారు. ఎలాంటి సమావేశాలు జరుపుకోవాల నుకు న్నా అను మతులు తప్పనిసరిగా చేయడం జరిగింది. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతం గా నిర్వ హించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లా ఎన్నికల అధి కారులు చర్యలు వేగవంతం చేయడం విశేషం.
పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు చర్యలు
జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేపడుతున్నాం. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఆయా పార్టీలకు నిబంధనలపై వివరించడం జరిగింది. చెక్‌పోస్టులను ఏర్పాటు చేశాం. నగదు, బంగారం, మద్యం రవాణాలో నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనల అమలులో అధికారులకు సహకరించాలి. ఎలాంటి సమావేశాలకైనా అనుమతులు తీసుకోవాలి. ఎన్నికల నిర్వహణలో పారదర్శకంగా చర్యలు తీసుకొనేలా అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. ఇంకా కొత్త ఓటర్లు ఉంటే పేర్లు నమోదు చేసుకొనే అవకాశం కల్పించాం.
-ఉదయ్‌కుమార్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్