జడ్చర్ల, నవంబర్ 30 : జడ్చర్ల మున్సిపాలిటీలో శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్‌జాం చోటుచేసుకున్నది. నిత్యం ట్రాఫిక్‌జాంతో ఇబ్బందులు పడుతుండగా.. అమిస్తాపూర్ వద్ద సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ ఉండంతో రాష్ట్రంలోని నలుమూలల నుంచి కాంగ్రెస్ నాయకులు, రైతులు బస్సుల్లో తరలిరావడంతో జడ్చర్ల పూర్తిగా అష్టదిగ్బంధనంలో చిక్కుకున్నది.
అన్ని ప్రాంతాలకు జడ్చర్ల మధ్యలో ఉండడంతో ప్రతి వాహనం జడ్చర్ల మీదుగానే మహబూబ్‌నగర్ చేరుకున్నది. దాంతో జడ్చర్లలోని ప్రతి ప్రధాన రహదారిపై గంటల కొద్ది వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా జడ్చర్ల-కల్వకుర్తి రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండడం, రైల్వేబ్రిడ్జి వద్ద సింగిల్‌లైన్ ఉండడంతో వాహనాల రద్దీతో ఒకవైపు పూర్తిగా నిలిచిపోయాయి. వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. అలాగే జడ్చర్లకు ప్రతినిత్యం పనుల మీదవచ్చే వారు సైతం ట్రాఫిక్జాంలో ఇరుక్కుపోయి నానా అవస్థలు పడ్డారు.
హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వెళ్లే వాహనాలను కావేరమ్మపేట వద్ద రోడ్డు మళ్లించి ఫ్లై ఓవర్ కిందనుంచి అనుమతించడంతో ఫ్లై ఓవర్ వద్ద పూర్తిగా ట్రాఫిక్ జామైంది. అదీనుగాక సాయంత్రం ఆరు గంటల సమయంలో ఫార్మా కంపెనీల బస్సులు వాటికి తోడవడంతో ట్రాఫిక్‌కు మరింత ఇబ్బందులు నెలకొన్నాయి. జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నా.. వాహన రద్దీ ఎక్కువగా ఉండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. జడ్చర్ల ైఫ్లై ఓవర్ వద్ద ఎస్సై శివానందం వాహనాలను క్లియర్ చేస్తున్నా ట్రాఫిక్ తగ్గలేదు. దాంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.