మహబూబ్‌నగర్, జూన్ 7 (నమస్తే తెలంగాణ ప్ర తినిధి) : ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తున్నది. వారం ముం దుగానే నైరుతి రుతుపవనాలు పాలమూరును తాకడంతో అన్నదాతలు ఆనందంతో పొంగిపోతున్నారు. రికార్డు స్థాయి వేడిమిని తట్టుకోలేక విలవిల్లాడిన జ నం వాతావరణం చల్లబడటంతో ఒక్కసారిగా ఉపశమనం పొందారు. మరోవైపు ఉమ్మడి జిల్లా లో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. వీటికి పిడుగులు తోడై ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోగా.. మూగజీవాలు సైతం బలవుతున్నాయి.
అక్కడక్కడా సమృద్ధిగా వర్షా లు కురవడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్న మై సాగుకు సిద్ధమవుతున్నారు. కొన్నిచోట్ల వాగులు, వంకలు పొంగుతుండగా.. మరికొన్ని చోట్ల కురుస్తున్న పదును వానకు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసి పెట్టుబడి సా యం కోసం ఎదురుచూస్తున్నారు.
కేసీఆర్ హయాం లో వానకాలం ప్రారంభానికి ముందే ఖాతాల్లో రైతుబంధు జమ చేసేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను అమలు చేయకపోవడంతో అన్నదాతలు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రైతులకు రుణాలివ్వడానికి బ్యాంకులు సైతం ముందుకు రాకపోవడంతో ప్రైవేట్ అప్పులు తప్పడం లేదు. గత యాసంగి రైతులను నిరాశకు మిగల్చగా.. కరెంట్ కోతలు కుంగదీస్తున్నాయి. చిన్నపాటి వర్షానికి కరెంటు తీస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల నారుమళ్లు ఎండిపోయే పరిస్థితి దాపురించింది.
ఒకవైపు తొలకరి పలకరిస్తుంటే.. మరోవైపు తుఫా న్ ప్రభావంతో పలు చోట్ల పిడుగుపాటుకు మనుషు లు, జీవాలు బలవుతున్నాయి. వారం రోజులుగా ఉ మ్మడి జిల్లాలో వివిధ ఘటనల్లో 12 మంది చనిపోయా రు. నాగర్‌కర్నూల్‌లో గోడ కూలి నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పలుచోట్ల పిడుగుపాటుకు ఎనిమిదిమంది మృతిచెందారు. ఇటు కుటుంబసభ్యులు.. అటు మూ గజీవాలు కండ్ల ముందే చనిపోతుంటే అన్నదాతల ఆవేదన అంతా ఇంతా కాదు..
రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్షగట్టింది. వానకాలానికి అవసరమైన పెట్టుబడి కోసం అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం సీజన్ ప్రారంభానికి ముందే టింగ్ టింగ్ మంటూ రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేసేది. అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద ఏడాదికి రూ.15వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ గత యాసంగిలోనే రైతులకు మొండిచేయి చూపింది. ఈసారి వానకాలం ప్రారంభమవుతున్నా రైతు భరోసా జాడేలేదు.
పెట్టుబడి కోసం రై తాంగం బ్యాంకుల చుట్టూ తిరిగితే బ్యాంకర్లు కూడా అప్పు ఇవ్వకపోగా వడ్డీతో సహా తీర్చాలని నోటీసులిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యలంటూ విద్యుత్‌శాఖ అధికారులు చిన్నపాటి వర్షానికే కరెంట్ తొలగిస్తుండడంతో రైతాంగం ఇబ్బందులు పడుతున్నది. నాట్లు వేసేందుకు నారుమళ్లు సిద్ధం చేసుకు న్నా.. నీళ్లు సరిపోక ఎండిపోయే పరిస్థితికొచ్చా యి. కష్టా ల కడలి లో సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు.
నైరుతి పవనాల ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. వానకాలం ప్రారంభానికి ముందే తొలకరి పలకరించింది. గతేడాది జూలై, ఆగస్టులో వానలు కురవగా అన్నదాతలు ఆలస్యంగా సాగు ప్రారంభించారు. ఈసారి వర్షాలు ముందుగానే కురుస్తుండడంతో పొలాలు వర్షపునీటితో తడిసిపోతున్నాయి. దీంతో రైతులు వరి నాట్లు వేసేందుకు, ఇతర పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు. గతేడాదికి మించి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో అన్నదాతలు పెద్ద ఎత్తున సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. అక్కడక్కడా విత్తనాల కొరత వచ్చినా రైతులు ప్రైవేట్‌గానైనా విత్తనాలను కొని సాగుకు సంసిద్ధమవుతున్నారు.