గట్టు, సెప్టెంబర్ 6 : చిన్నోనిపల్లికి వరద ప్రవాహం తగ్గడంలేదు. సమాంతర కాల్వ ఏర్పాటు చేసినప్పటికీ గ్రామంలో రిజర్వాయర్ నీరు తగ్గడంలేదు. అవుట్‌ఫ్లో కన్నా ఇన్‌ఫ్లోనే ఎక్కువగా ఉండడంతో ఏరోజుకారోజు రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరుగుతున్నది. కాగా కిందిగేరి వీధుల వరకు వచ్చిన వరద శుక్రవారం ఇండ్లు, వాకిళ్ల లోపల వరకు వచ్చాయి.
ఇదిలా ఉండగా పరిస్థితిని చూడడానికి తాసీల్దార్ శుక్రవారం చిన్నోనిపల్లికి వచ్చారు. కాగా ఆమె కారుకు అడ్డుగా వచ్చిన గ్రామస్తులు, నిర్వాసితులు, మహిళలు వాహనం ముందుకు వెళ్లకుండా అడ్డుగా ని లిచారు. అంతా అయిపోయాక రావడమేమిటని ప్రశ్నించారు. సౌకర్యాలు దేవుడెరుగు. అందరికీ ప్లాట్లు కూడా ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తామెక్కడి వెళ్లాలంటూ మహిళలు ఆక్రోశం వెళ్లగక్కారు. అందరూ ప్రజాప్రతినిధులతోపాటు కింది నుంచి పైస్థాయి వరకు అధికారులు కూడా తమను ఆదుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో చేసేదిలేక తాసీల్దార్ సరితారాణి వాహనం నుంచి కిందకు దిగకుండానే వెనుతిరిగారు.