జడ్చర్లటౌన్, మే 11 : నకిలీ బంగారం విక్రయించి మోసం చేశారన్న కోపంతో కిడ్నాప్ చేసి దాడి చేయడంతోపాటు ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడిన కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ రమేశ్‌బాబు తెలిపారు. గురువారం జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మండలంలోని నెక్కొండకు చెందిన బాలస్వామి కోడ్గల్ గ్రామశివారులోని రవికుమా ర్ తోటలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా అచ్చంపేటకు చెందిన లక్ష్మి పరిచయమైంది. రెండునెలల కిందట ఆమె బంధువు రమేశ్‌తోపాటు మరో మహిళను బాలస్వామి కి పరిచయం చేసి వారి వద్ద బంగారం ఉంద ని నమ్మబలికారు. ఈ క్రమంలో బాలస్వామికి బంగారు బిస్కెట్‌ను రూ.2లక్షలకు విక్రయించారు. అయితే డబ్బులు అవసరమై బంగారు బిస్కెట్‌ను విక్రయించేందుకు గోల్డ్‌స్మిత్ వద్దకు వెళ్లగా, బంగారు బిస్కెట్ నకిలీదని తేలింది.
ఈ నేపథ్యంలో అమ్మిన వారిని సంప్రదించి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా.. వారు స్పందించలేదు. ఈ క్రమం లో నెక్కొండకు చెందిన శ్రీశైలంతో బంగారం కొనుగోలు చేస్తామని చెప్పించి రమేశ్‌తోపాటు ఇద్దరు మహిళలను ఈనెల 8న కల్వకుర్తికి రప్పించారు. గ్రామానికి చెందిన బాలస్వామి, నరేశ్, శ్రీశైలం, వంశీ, ప్రవీణ్‌గౌడ్, కాటమోని శేఖర్, కుమ్మరి గణేశ్, చాకలి వంశీ(కారు డ్రైవర్), లక్ష్మి బైక్‌లపై కల్వకుర్తికి వెళ్లి అక్కడే ఉన్న రమేశ్‌తోపాటు మరో ఇద్ద రు మహిళలను కిడ్నాప్ చేసి కారులో కోడ్గల్ గ్రామశివారులోని రవికుమార్ తోటలోకి తీసుకెళ్లి నిర్బంధించారు. అదేరోజు రాత్రి ఇద్దరు మహిళలను వేర్వేరు గదుల్లోకి తీసుకెళ్లి బాలస్వామి, నరేశ్, శ్రీశైలం, వంశీ లైంగికదాడికి పాల్పడ్డారు. ఎలాగోలా బాధిత మహిళలు అక్కడి నుంచి తప్పించుకుని ఈనెల 9న జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గురువారం జడ్చర్ల రైల్వేస్టేషన్ వద్ద నిందితులు ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మూడు ద్విచక్రవాహనాలు, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితులను కోర్టులో హాజరుపర్చనున్నట్లు సీఐ తెలిపారు. మిగతా ఇద్దరు నిందితులైన లక్ష్మి, కారుడ్రైవర్ వంశీ పరారీలో ఉన్నారని, త్వరలోనే ఇద్దరిని అరె స్టు చేస్తామని సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సై ఖాదర్, పోలీసు సిబ్బంది ఉన్నారు.