మహబూబ్‌నగర్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించి.. ఓడిపోగానే ప్రజల పక్షాన పోరాడాల్సిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్వార్థం కోసం పార్టీ మారడంపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. బుధవారం నల్లమల సాక్షిగా మాజీ ఎమ్మెల్యేపై తిరుగుబాటు ప్రకటించారు. నియోజకవర్గంలోని ప్రధాన నాయకులు, కార్యకర్తలు ఎవరూ కూడా వెళ్లకూడదని తీర్మానించారు.
నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాకుండా కూడా కేసీఆర్ భిక్షతో రాజకీయ అరంగేట్రం చేసిన గువ్వల పార్టీకి ద్రోహం చేసే చర్యలపై తీవ్రంగా ఖండించారు. మేమంతా కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలోనే ఉంటామని.. పార్టీని వీడిపోమని ప్రతిజ్ఞ చేశారు. అచ్చంపేటలో జరిగిన ఈ తిరుగుబాటు సమావేశానికి పార్టీ శ్రేణులు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హాజరయ్యారు. పార్టీకి ద్రోహం చేసిన నేతలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
గువ్వల వెంట ఎవరూ కూడా వెళ్లడం లేదని.. కొంతమంది పెయిడ్ కార్యకర్తలను వెంటబెట్టుకొని అచ్చంపేటలో హల్చల్ చేసి పార్టీని బద్నాం చేస్తే ఊరుకునేది లేదని నియోజకవర్గ నాయకులంతా ఒక్క తాటిపై వచ్చి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పార్టీ మారుతున్న గువ్వలకు ఈ సమావేశం పెద్ద షాక్‌గా మారింది. రాజకీయంగా ఆశ్రయం కల్పించిన అచ్చంపేట పరువు తీసిన మాజీ ఎమ్మెల్యే తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ఆయన్ను రాజకీయ భూస్థాపితం చేస్తామని ప్రతిన బూనారు. అచ్చంపేటలో ఒకే ఒక్క పిలుపుతో వందలాది మంది పార్టీ శ్రేణులు హాజరు కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
రేపు అచ్చంపేటకు హరీశ్‌రావు రాక
ఈనెల 8వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లాలో మాజీ మంత్రి హరీశ్‌రావు పర్యటించడం రాజకీయ ప్రాధాన్యతను సంచరించుకుంటుంది. అ చ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి ద్రోహం చేసి.. ఇతర పార్టీతో డీల్ మాట్లాడుకుని పార్టీ మారుతుండటంతో క్యాడర్‌ను సమాయత్తం చేసేందుకు మాజీ మంత్రి అచ్చంపేటకు వస్తున్నారు. రెండుసార్లు బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి ఆ తర్వాత ప్రభుత్వ విప్ పదవి పొంది పార్టీకి ద్రోహం తలపెట్టిన మాజీ ఎమ్మెల్యే తీరుపై అచ్చంపేట నియోజకవర్గ పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.
దీంతో పార్టీ కార్యకర్తలకు మనోబలం చేకూర్చేందుకు హరీశ్‌రావు వస్తుండడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్నది. అచ్చంపేట నియోజకవర్గంలో నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు పార్టీలో యువ నేతలకు.. నాయకత్వం వహించే దిశగా హరీశ్ దిశా నిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా మాజీ ఎమ్మెల్యే తీరుపై చాలామంది బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే ఆయన వెంట వెళ్లేందుకు నిరాకరిస్తున్న తీరుపై పార్టీ హైకమాండ్ ఆదేశం మేరకు హరీవ్ అచ్చంపేటకు వస్తున్నారు. ఆయన రాక నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ సాధకుడి వెంటే..
ఆంధ్రా పాలకులతో కోట్లాడి తెలంగాణను
సాధించి పెట్టిన మాజీ సీఎం కేసీఆర్ వెంటే
మేమంతా ఉన్నాం. వ్యక్తులు పార్టీలోకి వస్తుంటారు పోతుంటారని తాము బీఆర్ఎస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేసి ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తాం.
– బోడ నారాయణ, బీఆర్ఎస్ బీసీ సెల్ మండల నాయకుడు
కేసీఆర్‌తోనే గిరిజనులకు గుర్తింపు
తెలంగాణలో మొదటగా గిరిజనులను గుర్తించి జనాభా కనుగుణంగా 10 శాతం ఉద్యో గ, విద్య రంగాల్లో రిజర్వేషన్లను పెంచింది మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తాము కేసీఆర్ నాయకత్వం కింద పనిచేస్తామని ఆయన తమ జాతికి చేసిన కృషిని మరవకుండా బీఆర్ఎస్ వెంటే తామంతా ఉంటాం. పార్టీ నిర్ణయమే తమ నిర్ణయమని నియోజకవర్గ ఇన్చార్జిగా ఎవరిని నియమించినా సహకరించి ప్రజల పక్షాన నిలబడతాం.