కల్వకుర్తి, జూలై 10 : తెలంగాణలో రెడ్డొచ్చె మొదలనే పదం చాలా వాడుకలో ఉంటుంది. గ్రామాలలో పండుగలు, పబ్బాలప్పుడు రాత్రి వేళల్లో నాటకాలు(ఆటలు) వేస్తుంటారు. నాటకం ప్రారంభమై సగం వరకు వచ్చినప్పుడైనా సరే.. ఆ ఊరి పెద్ద పటేల్ లేదా రెడ్డి వచ్చినప్పుడు ఆట మళ్లా మొదటికాడి నుంచి ఆడాల్సిందే. అందుకే ఆట మధ్యలో పెద్ద రెడ్డి వస్తే.. రెడ్డొస్తే మొదలు.. అంటారు. ఇదే నానుడి సరిగ్గా 100 పడకల దవాఖాన శంకుస్థాపనకు అతికినట్లు సరిపోతుంది.
బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో 2023 అక్టోబర్ ఒకటో తేదీన కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 99లో అప్పటి వైద్య, ఆరోగ్య శాఖ మంతి టీ.హరీశ్‌రావు చేతుల మీదుగా 100 పడకల దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయా యి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో దవాఖాన నిర్మాణం కార్యరూపం రాల్చలేదు. దాదాపు 20 నెలల తర్వాత దవాఖాన నిర్మాణానికి మరోసారి మంత్రులు శంకుస్థాపన చేయనుండడంతో కల్వకుర్తి వాసులు రెడ్డొచ్చె మొదలని ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023 జూన్ 28న కల్వకుర్తిలో 100 పడకల దవాఖాన నిర్మాణానికి రూ.17.50 లక్షలతో నిర్మించడానికి పరిపాలన అనుమతులు లభించాయి. ఈ నిర్మాణానికి పరిపాలన అనుమతులనిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 366 విడుదల చేసింది. దీంతో పాటు ప్రభుత్వ కమ్యూనిటీ దవాఖానలో మెరుగైన వసతుల (మరమ్మతులు) కోసం రూ.65 లక్షలు విడుదలకు పరిపాలనా అనుమతులు వచ్చాయి.
దీంతో అప్పటి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కల్వకుర్తిలో సర్వేనెంబర్ 99లో డబుల్ బెడ్రూం ఇండ్ల ఎదుట స్థలాన్ని ఎంపిక చేశారు. సంబంధిత కార్యక్రమాలను పూర్తి చేసుకుని నిర్మాణానికి నాటి మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న కొందరు నా యకులు దవాఖానకు ఎంపిక చేసిన స్థలం సరిపోదని వాదించారు. ఉన్న స్థలాన్నే పూర్తి స్థాయిలో వి నియోగించుకుని అత్యాధునిక స్థాయిలో నిర్మిస్తున్నామని సభలో హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
గత ప్రభుత్వం శంకుస్థాపన చేసిన పనులను ప్రారంభించకుండా తిరిగి అదే పనికి శంకుస్థాపన చేయడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. చేసిన పనికి తిరిగి శంకుస్థాపన చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. దాదాపు 20 నెలల కాలం వ్యర్థమైందని, అప్పుడే పనులు మొదలు పెడితే ఇప్పటి వరకు దాదాపు పను లు పూర్తయ్యేవని ఆవేదన చెందా రు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కాని ప్రజాహిత కా ర్యక్రమాలు చేపట్టడానికి రాజకీయాలు చేయొద్దని బీఆర్ఎస్ శ్రేణులు సూచిస్తున్నాయి.
కల్వకుర్తిలో 100 పడకల దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు శుక్రవారం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నారు. అలాగే నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వారు శ్రీకారం చుట్టనున్నారు.
అయితే శంకుస్థాపనలు చేసిన పనులకే మళ్లా చేయనుండడంపై స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.