ధరూరు, డిసెంబర్ 5: గురుకుల పాఠశాల గేట్లు మూసుకుని ఇంకా ఎంత మంది విద్యార్థులను పొట్టన పెట్టుకోవాలని ప్లాన్ వేశారో చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బాసు హనుమంతు నాయుడు ప్రభుత్వంపై మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురువారం మండలంలోని ర్యాలంపాడు క్వార్టర్స్‌లో నిర్వహించబడుతున్న కేటీదొడ్డి మండల మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల విద్యాలయాన్ని సందర్శించేందుకు బీఆర్ఎస్ నాయకులతో కలిసి వెళ్లారు. కాగా ప్రిన్సిపాల్ లోపలికి రానివ్వకుండా గేట్లు వేశారు. ఇదేంటని ప్రశ్నించగా.. ప్రభుత్వం నుంచి మాకు అనుమతులు లేవు, ఎవరినీ రానివ్వొద్దని ఆదేశాలున్నాయన్నారు.
దీంతో నాయకులు గేట్ బయటే ఉండి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు విద్యాలయంలో ఉన్న సమస్యలపై బీఆర్ఎస్ నాయకులకు వివరించారు. దీంతో బీహెచ్ఎన్ గురుకుల పాఠశాలలపై వ్యవహరిస్తున్న ప్రభుత్వ నిర్లక్ష్య తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యార్థులకు సరైన మౌలిక వసతులు, భోజనం పెట్టలేని ప్రభుత్వం ఎందుకని ధ్వజమెత్తారు. ప్రజాపాలన సర్కారు నాయకులు విజిట్ చేయ రు.., ప్రభుత్వ అధికారులు సందర్శించరు.. మేమన్నా చూద్దామంటే చూడనివ్వరు.., సరే సక్రమంగా నడుపుతారా అంటే అన్ని సమస్యల వలయంలోకి నెట్టుతారు.
ఇదేనా మీ పోకడని విమర్శించారు. విద్యార్థులను చంపడానికే కంకణం కట్టుకున్నారా ఏంది, ఖబడ్దార్ కాంగ్రెస్ ప్రభుత్వమా, రేవంత్‌రెడ్డి నీకు విద్యార్థుల తల్లిదండ్రుల ఉసురు తగులుద్ది, అందులో నువ్వు కొట్టుకుపోయే కర్మ దగ్గరలోనే ఉందని గుర్తించుకోవాలని హెచ్చరించారు. బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు విద్యార్థులను బలి తీసుకోవడం అలవాటైపోయింది. నాడు ఉద్యమంలో తెలంగాణ ప్రకటనను నిర్లక్ష్య ధోరణితో 1200 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకుంది, నేడు నాణ్యత లేని ఆహారం పెడుతూ గురుకు ల విద్యార్థులను చంపడానికి కంకణం కట్టుకుందని ఆరోపించారు.
విద్యార్థుల చావు కేకలు వినకుంటే కాంగ్రెస్ కంటికి నిద్ర పట్టనట్టుందని.. ఖబడ్దార్ రేవంత్‌రెడ్డి ఇక ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరిగినా నీ గుడ్డలూడదీసి నడివీధిలోకి ఈడ్చకపోతే మేము కేసీఆర్ సైనికులమే కాదని గుర్తుంచుకో.., నాడు ఉద్యమంలో కేసీఆర్‌నే చంపడానికి ప్లాన్ వేసిన కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నం.. రేవంత్‌రెడ్డి కాస్కో మా బీఆర్ఎస్ తడాఖా అని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తిరుమలేశ్, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ఎండీ మాజ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.