అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద జరిగిన SLBC టన్నెల్ ప్రమాదంలో మృతి చెందిన, రాబిన్స్ ఇండియా కంపెనీలో ఎరెక్టర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహించిన పంజాబ్ వాసి గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని అతని స్వగ్రామానికి తరలించారు. ఆయన భార్య రజ్వీందర్ కౌర్‌కు మృతదేహం అప్పగించినట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.
గురుప్రీత్ సింగ్ కుటుంబానికి ఆర్థిక సాయంగా తెలంగాణ ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేసిందని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో 8 మంది చిక్కుకోగా వారిలో గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యం కాగా జిల్లా యంత్రాంగం ఆ మృతదేహాన్ని నాగర్ కర్నూల్ ఆసుపత్రిలో పోస్టుమార్టానికి తరలించింది. అనంతరం ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాన్ని పంజాబ్ రాష్ట్రానికి తీసుకువెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంబులెన్సులో రెవెన్యూ, ఆరోగ్యశాఖ, పోలీస్ శాఖ, కంపెనీ ఉద్యోగులు అక్కడికి వెళ్లారు.