గద్వాల/అలంపూర్, జూలై 30 : ఓ వైపు ఉచిత పథకాల పేరుతో అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో అటు రైతులు అరిగోస పడుతుండగా.. ఇటు గురుకుల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఎం రేవంత్ సొంత జిల్లా లో ప్రభుత్వ గురుకులాలు, కస్తూర్బా పాఠశాలలు సమస్యలకు కేరాఫ్‌గా మారాయి. సమస్యలు తీర్చాలని విద్యార్థులు కోరుతున్నా.. పాలకులు, అధికారుల్లో చలనం కరువైంది.
ఈ క్ర మంలో నాణ్యతలేని భోజనంతో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయినా ప్రభుత్వానికి చీమకుట్టిన ట్లు కూడా లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం.. సరైన నిర్వహణ లోపం కొట్ట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. దీంతో సమస్యలు పరిష్కరించాలని పలుచోట్ల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామ పంచాయతీలోని అలంపూర్ చౌరస్తాలో మహాత్మా జ్యో తిరావు ఫూలే గురుకుల విద్యార్థులు నిరసనకు దిగారు. పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలంటూ పదో తరగతి విద్యార్థులు సుమారు 60 మంది ఉదయం 8 గంటలకు అలంపూర్ చౌరస్తా నుంచి హైవే-44వ జాతీయ రహదారి మీదుగా పాదయాత్ర చేపట్టారు.
సమస్యలకు కేరాఫ్‌గా..
విద్యార్థుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వానికి, అధికారులకు సమస్యలను తెలియజేయాలని విద్యార్థులు పాదయాత్ర చేపట్టారు. గురుకుల పాఠశాలలో ప్రధానంగా మరుగుదొడ్ల సమస్య ఉన్నప్పటికీ పైపులు జామయ్యాయని.. కొన్ని నెలలుగా మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి.
మరమ్మతులకు నోచుకోలేదు. రాత్రయినా.. పగలైనా.. విద్యార్థులు బహిర్భూమికి పంట పొలాల్లోకి వెళ్లాల్సిన దుస్థితి. తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నది. బోరు నీరు వస్తున్నా.. ఫ్లోరైడ్ వాటర్ కావడంతో స్నానాలకు, బట్టలు ఉతకడానికే పనికి వస్తున్నాయని విద్యార్థులు వాపోయారు. మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలని గతేడాది నుంచి కోరుతున్నా అధికారుల్లో చలనం కరువైంది. అన్ని సమస్యల మధ్య చదువు ఎలా కొనసాగించాలని పలువురు విచారం వ్యక్తం చేశారు.
గత డిసెంబర్లో..
గతేడాది డిసెంబర్ 24న బీచుపల్లి గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తమకు మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని, ఏదైనా సమస్యలపై ప్రిన్సిపాల్‌ను అడిగితే వేధింపులకు గురిచేస్తున్నాడని సుమారు 200 మంది విద్యార్థులు ఆందోళన చెందారు. తమకు నాణ్యమైన భోజనం అంది ంచడంతోపాటు వేధింపులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ గద్వాల కలెక్టరేట్‌కు పాదయాత్రగా చేరుకొని కలెక్టర్‌కు వారి సమస్యలు విన్నవించారు.
ఆ సంఘటన మరువక ముందే.. తాజాగా అలంపూర్ చౌరస్తాలోని గురుకులంలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు పాదయాత్ర చేపట్టారు. దీంతోపాటు గద్వాల మండలం పుటాన్పల్లి స్టేజీ సమీపంలో ఉన్న తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ అప్‌గ్రేడ్ రెసిడెన్షియల్ కళాశాల (కేటీదొడి)్డ బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు సరైన బాత్రూంలు లేక అవస్థలు పడుతున్నారు. వసతి గృహం ఒక చోట.. టాయిలెట్లు మరో చోట ఉండడంతో రాత్రివేళల్లో విద్యార్థినులు వెళ్లేందుకు భయాందోళనకు గురవుతున్నారు.
స్పందించిన అధికారులు
విద్యార్థులు పాదయాత్ర చేపట్టిన విషయాన్ని తెలుసుకున్న జిల్లా అధికారులు స్థానిక అధికారులతో మాట్లాడి అలర్ట్ చేశారు. తాసీల్దార్, ఎస్సైను విద్యార్థుల వద్దకు పంపించారు. ఇటిక్యాల పాడు స్టేజీ వద్ద విద్యార్థుల వద్దకు వెళ్లి నచ్చజెప్పారు. సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్, అధికారులు కృషి చేస్తారు.. పాదయాత్రను విరమించాలని కోరారు. విద్యార్థులను శాంతింపజేసి పాఠశాలకు వెనక్కి పంపించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై అధికారులు విద్యార్థులతో మాట్లా డి తెలుసుకున్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా..
బీఆర్ఎస్ పాలనలోనే గురుకులాలు ఒక వెలుగు వెలిగాయి. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా బోధన, భోజనం అందేదని విద్యార్థులు తల్లిదండ్రులు తెలిపారు. కేసీఆర్ ముందు చూపుతో ప్రతి పేద విద్యార్థికి కార్పొరేట్ స్థాయిలో మెరుగైన విద్య బోధన అందింది. దీంతో పాటు రుచికర భోజనం అందించి.. ఇంటిని మరిపించేలా గురుకులాలను నిర్వహించారు. దీంతో తల్లిదండ్రులు సైతం వారి పిల్లలకు చేర్పించేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపడంతో సీట్లకు డిమాండ్ ఏర్పడింది.
నిర్వహణ గాలికి..
కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల నిర్వహణను గాలికొదిలేసింది. దీంతో నిత్యం ఏదో ఒక చోట విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలంటూ రోడ్లెక్కుతున్నారు. మరికొన్ని చోట్ల నాణ్యతలేని ఫుడ్‌తో పాయిజన్ అయి విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇప్పటికే మాగనూర్ మండలంలో విద్యార్థులకు ఫుడ్‌పాయిజన్ అయి దవాఖానలో చేరడం రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. అయినా అధికారుల, ప్రభుత్వ తీరు లో మార్పు రాలేదు.
ఆ సంఘటన మరువక ముందే నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. సంచలనంగా మారిన రెం డు ఘటనలతో అధికారులు, ప్రభుత్వ తీరులో ఎలాంటి మా ర్పు రావడం లేదు. నాడు ఉన్నత లక్ష్యంతో గత ప్రభుత్వం ఏ ర్పాటు చేస్తే నేటి ప్రభుత్వం నీరుగార్చుతున్నది. నాడు గురుకులాల్లో అడ్మిషన్ల కోసం పోటీపడిన తల్లిదండ్రులు నేడు పిల్లలను చదివించడానికి వెనుకంజ వేసే పరిస్థితులు దాపురించాయి.
కస్తూర్బాల్లోనూ పరిస్థితి అంతే..
జిల్లాలో కస్తూర్బా విద్యాలయాల పరిస్థితి అలాగే ఉంది. ఈ నెల 15న జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో చదువుతున్న ఇంటర్ విద్యార్థిని సాయిశృతి పాఠశాల మొదటి అంత స్తు నుంచి కిందపడి తీవ్రంగా గాయపడింది. వెంటనే స్పందించిన పాఠశా ల సిబ్బంది ద వాఖానకు తరలించడంతో ప్రమాదం తప్పింది. విద్యార్థి కళ్లు తిరిగి కింద పడిందా మరేదైనా కారణం ఉందా అనేది తేలాల్సి ఉంది. ఈ ఘట న మరువక ముందే బుధవారం ఉండవెల్లి మండ లం కలుగోట్ల గ్రామంలో ఉన్న కేజీవీబీ పాఠశాల వి ద్యార్థిని ద్రాక్షాయిని పాముకాటుకు గురైంది. ప్రస్తుతం కర్నూల్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతుంది. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి గురుకులాలు, కస్తూర్బాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
మంచి బియ్యం పంపాలని చెప్పాం
పురుగులతో కూడుకున్న బియ్యం సరఫరా చేశారు. వాటిని గమనించి అన్నం వండేటప్పుడు వాటిని శుద్ధి చేసి వాడుతున్నాం.. కానీ బియ్యంలో పురుగులు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సార్లు ఒకరిద్దరికి అన్నంలో పురుగులు వచ్చి ఉండొచ్చు. బియ్యం బస్తాలు మార్చి వేరే స్టాక్‌లో మంచి బియ్యం పంపాలని అధికా రులను కోరాం. కానీ వారు పట్టించుకోలేదు.
– రేణుక, గురుకుల పాఠశాల హాస్టల్ ఇన్చార్జి వార్డెన్
టాయిలెట్లకు పొలాల్లోకి వెళ్తున్నాం..
పాఠశాలలో చాలా రోజులగా మరుగుదొడ్ల సమస్యలు నెలకొన్నాయి. మరుగుదొడ్ల పైపులు బ్లాక్ అయి పనిచేయడం లేదు. బహిర్భూమికి పొలాల్లోకి వెళ్లాల్సి వస్తుంది. నీటి సౌకర్యం కూడా సరిగా లేదు. అందుకే రోడ్డెక్కి నిరసన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అధి కారుల దృష్టికి తీసుకెళ్తేనే తీరుతాయన్నదే ఉద్దేశం.
– శ్యామ్, పదో తరగతి విద్యార్థి, అలంపూర్ చౌరస్తా
బియ్యంలో పురుగులొస్తున్నాయి..
అన్నంలో పురుగులు వస్తున్నాయని వార్డెన్‌కు చెబితే మీ కడుపులోనే పురుగులే కదా ఉన్నాయని అంటున్నారు. రాత్రిళ్లు మరుగుదొడ్డికి వెళ్లాలంటే భయంగా ఉన్నది. సౌకర్యాలు లేక చదువుపై దృష్టి సారించలేకపోతున్నాం. ఎవరికి చెప్పాలో తెలియక తిక మక పడుతున్నాం. ఇప్పటికైనా సమస్యలు తీర్చాలి.
– రాఘవేంద్ర, పదో తరగతి విద్యార్థి, అలంపూర్ చౌరస్తా