అలంపూర్ చౌరస్తా, జూలై 30 : మహా త్మ జ్యోతిరావు ఫూలే బాలుర గురుకుల పాఠశాలలో కనీస వసతులు కల్పించాలని డిమాం డ్ చేస్తూ విద్యార్థులు జాతీయ రహదారి మీదుగా గద్వాలకు పాదయాత్ర చేపట్టిన బుధవారం ఉండవెల్లిలో చోటు చేసుకున్నది. ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని ఒక ప్రైవేట్ భవనంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలుర పాఠశాలను నిర్వహిస్తున్నారు. పాఠశాలలో కనీస వసతులు లేకపోవడంతో వాటి పరిష్కారం కోసం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసేందుకు 60 మంది విద్యార్థులు బుధవారం ఉదయం పాఠశాలలో టిఫిన్ చేసి 44వ జాతీయ రహదారి మీదుగా ర్యాలీగా బయలుదేరారు.
పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు నినాదాలు చేస్తూ పాదయాత్ర వెళ్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించి ససేమిరా అన్నారు. సుమారు ఏడు కిలో మీటర్లు జాతీయ రహదారిపై నడుచుకుంటూ గద్వాల వైపు ముందు సాగారు. పోలీసులు ఎంత అడ్డగించినా విద్యార్థులు పొల్లాల వెంట, రహదారి కింద దిగి పోలీసులను తప్పించుకుంటూ పాదయాత్ర చేశారు.
దీంతో సీఐ రవిబాబు, రెండు మండలాల ఎస్సైలు శేఖర్, చంద్రకాంత్‌లు సిబ్బందిని వెంటేసుకొని జాతీయ రహదారిపై ఇటిక్యాలపాడు స్టేజీ వద్దకు చేరుకొని రహదారికి అడ్డంగా నిల్చుండి విద్యార్థుల నిలిపి వారి సమస్యలపై ఆరా తీశారు. జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్లడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని ఒక అవకాశం ఇస్తే పాఠశాలలో నెలకొన్న సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కంచే విధంగా చూస్తామని విద్యార్థులకు సీఐ రవిబాబు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
దీంతో విద్యార్థులు అందరూ ఇలా వస్తారు హామీలు ఇచ్చి మమ్మలి వదిలేసి వెళ్తారు మా సమస్యలు ఎవరూ పట్టించుకోరు, ఒక్క కలెక్టర్ మాత్రమే మా సమస్యలు పరిష్కారిస్తారని గద్వాల్‌కు వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు నడుచుకుంటూ వెళ్లోదని వాహనంలో వెళ్లాలని పోలీసులు డీసీఎం రప్పించి విద్యార్థులను వాహనంలో ఎక్కించి అలంపూర్ చౌరస్తాలో ఉన్న పాఠశాలకు తీసుకెళ్లారు. అనంతరం విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు.
మీ సమస్యలు చె ప్పాలని సీఐతోపాటు తాసీల్దార్లు ప్రభాకర్, జ్యోషిలు కోరడంతో విద్యార్థులు మాట్లాడుతూ నిత్యం అన్నంలో పురుగు లు వస్తున్నాయని, విద్యార్థులకు సరిపడా అన్నం అందుబాటులో లేదని 5 తరగతి నుంచి ఇంటర్ వరకు 635 మంది విద్యార్థులు చదువులు సాగిస్తున్నామని పాఠశాలలో విద్యార్థుల కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థులంతా తీవ్ర ఇ బ్బందులు పడుతున్నామని, ప్రధానంగా తాగునీరు, మరుగుదొడ్లు లేక ఇక్కట్లు పడుతున్నామని కన్నీరు పెట్టుకున్నారు.
బిల్డింగ్ యజమాని ధర్మారెడ్డి విద్యార్థులకు కల్పించాల్సిన వసతులను కల్పించకుండా నిత్యం పాఠశాలలో ఉంటూ విద్యార్థులను ఇష్టమొచ్చిన్నట్లుగా కొడుతున్నాడని, ఒక విద్యార్థికి సెల్‌ఫోన్‌తో కొట్టడంతో తలకు గాయాలైన ఉపాధ్యాయులు ఏ మాత్రం పట్టించుకోలేదని వివరించారు. దీంతో సీఐ రవిబాబు మాట్లాడుతూ మీ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని మీ సమస్యలు త్వరలో పరిష్కరించేందుకు చ ర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థులు రోడ్లపై ర్యాలీలు చేసే విధంగా ప్రేరేపించిన ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులను కొడితే ఫిర్యాదు చేయాలని, కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు.