వనపర్తి, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో టెండరుదారులు చెప్పిందే ధర అన్నట్లు కొనసాగుతున్నది. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రస్తుత వేరుశనగకు ధరలు తగ్గిపోయాయని సోమవారం రైతులు లబోదిబోమన్నారు. పదేండ్ల కిందటే యాసంగిలో వేరుశనగకు ఈ ధరలతో అమ్ముకున్నామని రైతులు ఆవేదన చెందారు. వనపర్తి మార్కెట్ యార్డుకు 350 మంది రైతులు 5వేల క్వింటాళ్ల వేరుశనగను తీసుకొచ్చారు. వ్యాపారులు పూర్తిగా ధరలు తగ్గించేశారు. కేవలం ఒకటి, రెండు వేరుశనగ చిన్న కుప్పలకు మాత్రమే రూ.6వేలు వేసి ఇతర రైతులను తుంగలో తొక్కారు.
మిగిలిన రైతులందరికీ కేవలం 4 నుంచి రూ.5వేలకు క్వింటాకు ధరలు వేసి రైతులకు నష్టం మిగిల్చారు. ఈ ఒక్క రోజు మార్కెట్ వచ్చిన ధాన్యం ధరలను పరిశీలిస్తే.. వ్యాపారుల జిమ్మిక్కులు చెప్పకుండానే అర్థమవుతాయి. మొత్తం 350 మంది రైతుల్లో 20 మంది రైతులకు చెందిన 300 క్వింటాళ్లకు మాత్రమే రూ.6వేల ధర వేసి ఎక్కువ ధరగా చెప్పుకున్నారు. ఇక మిగిలిన మరో 230 మందికి రూ.5వేలు క్వింటాకు ధర వేయగా, ఇంకో 100 మంది రైతులకు కేవలం రూ.4వేలకు పైబడి క్వింటాకు ధరలు వేశారు.
కేవలం 10 నుంచి 20 క్వింటాళ్లలో ఉండే బొడ్డెలకు మాత్రమే ఎక్కువ ధర వేసినట్లుగా చేసి 200 క్వింటాళ్ల వరకు వేరుశనగ తెచ్చిన రైతులకు తక్కువ ధరలు వేసి కుచ్చుటోపీ పెట్టారని రైతులు బావురుమన్నారు. అయితే, వేరుశనగకు తక్కువ ధరలు వేశారని మార్కెట్ కార్యదర్శి సరోజ దృష్టికి తెచ్చి పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ ధరలు వచ్చిన రైతులు రేపు, ఎల్లుండి మార్కెట్‌కు సెలవు ఉన్నందునా గురువారం వరకు ఉంటే మళ్లీ టెండరు పెట్టిస్తామని చెప్పడంతో రైతులు చేసేదేమీలేక నిరాశతో వెనుదిరిగారు. మొత్తం గా వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ రైతు మాత్రం ధరలతో దగా పడుతున్నాడు.
పదేండ్ల కిందటే ఈ ధరలు బుడ్డలు అమ్ముకున్నాం. 6 ఎకరాల్లో విత్తనం వేసి 130 సంచు లు మార్కెట్‌కు బుడ్డలు తెచ్చినం. తీరా ధర చూస్తే రూ.5,500లు క్వింటాకు ఇచ్చిం డ్రు. రైతుల ను దగా చేస్తున్నారు. ఇంత ఘోరమైన పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవు. రైతులు అప్పు లు మీద వేసుకోవాల్సిందే.
– రేవల్లి రాములు, రైతు, కాశీంనగర్, వనపర్తి మండలం
వ్యాపారులంతా కుమ్మక్కు కావడంతోనే ధర లు రావడం లేదు. 180 సంచుల వేరుశనగ తెచ్చా. కేవలం రూ.4,500 క్వింటాల్ ధర వేశారు. మార్కెట్ కార్యాలయంలో అడిగితే కంప్యూటర్లు పని చేయడం లేదని తప్పించుకుంటున్నారు. వరికి ప్రభుత్వ మద్దతు ధర ఉ న్నట్లుగానే వేరుశనగకు మద్దతు ధర పెట్టాలి. ఇంత తక్కువ ధరలు ఎప్పుడూ చూడలేదు.
– రఘువర్ధన్‌రెడ్డి, రైతు, దొడగుంటపల్లి, పెద్దమందడి మండలం
గతంలో ఇతర రాష్ర్టాలకు ఇక్కడి వేరుశనగ ఎక్స్‌పోర్టు అయ్యేది. అప్పట్లో ధరలు కూడా బాగా ఉండేవి. ప్రస్తుతం వేరుశనగకు ధరలు తక్కువగా ఉన్నాయి. ఇతర మార్కెట్లను కూడా పరిశీలిస్తున్నాం. ఇతర ప్రాంతాల కంటే ఇక్కడ తక్కువ ధరలు లేకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం. మహారాష్ట్రకు ఎక్కువగా ఈ ప్రాంతం నుంచి వేరు శనగ వెళ్లేది. ప్రస్తుతం బయటినుంచి టెండరుదారులు రావడం లేదు.
– శ్రీనివాస్‌గౌడ్, చైర్మన్, వ్యవసాయ మార్కెట్, వనపర్తి