మూసాపేట(అడ్డాకుల), మార్చి 15 : అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లిలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. మరోవైపు కరెంటు కొతలతో బోరుబావుల్లో సాగునీరు అందక ఆరుగాలం కష్టించిన పండించిన పంట కండ్ల ముందే కనుమరుగవుతున్నది. మరో వైపు కేఎల్ఐ ద్వారా సాగునీరు వస్తుందనుకున్న అన్నదాతలకు నిరాశే మిగిలింది. తిమ్మాయిపల్లిలో రాత్రి 11:30గంటల నుంచి వ్యవసాయ బోరు మోటర్లకు విద్యుత్ సరఫరా చేసేవారు.
15రోజులుగా మధ్యరాత్రి దాటిన తర్వాత 1:30గంటల నుంచి సాయంత్రం 5:30గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తుండడంతో నీళ్లు పారించక పంటలు ఎండుముఖం పట్టినట్లు రైతు లు ఆరోపిస్తున్నారు. ఇచ్చిన అరకొర విద్యుత్‌లో మధ్యలో కోతలు విధిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 7గంటలు దాటిందంటే చా లు ఎప్పుడు జంఫర్ పడిపోతుందో తెలియని పరిస్థితి నెలకొన్నదన్నారు. కరెంట్ సరఫఱా సరిగా రాకపోవడంతో తరుచూ వ్యవసాయ బోరుమోటర్లు కాలిపోతున్నట్లు రైతులు వాపోతున్నారు.
గ్రామానికి చెందిన రైతు రవి, కురుమ్మయ్యతోపాటు మరో 5మంది రైతులకు కలిపి ఒకే ఒక్క బోరు ఉన్నది. వారంతా వంతుల వారీగా బోరునీరు పారించుకుంటున్నారు. అయితే వారి పొలం దగ్గర్లోనే కేఎల్ఐ నుంచి వచ్చే సాగునీటి కాల్వ ఉన్నది. కాల్వ ద్వారా సాగునీరు రాకపోవడంతో రైతులు వంతుల వారీగా వ్యవసాయ బోరును రైతులకు ఒక్క తడికి వారం రోజులు పడుతున్నది.
ఆ సమయంలో మోటరు కాలిపోతే మరో 3,4 రోజులు పెరుగుతున్నది. దీంతో పంటలు ఎండుముఖం పట్టాయి. అలాగే రవి అనే రైతుకు ఉన్న 20గుంటల వరి పంట మొత్తం ఎండిపోయిందని, కుర్మయ్యకు చెందిన 10గుంటల వరకు వరి ఎండిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. చేసేది లేక రైతులు ఎండిన పంటలను గొర్రెలు మేపుతున్నారు. కేఎల్ఐ క్వాలల ద్వారా సాగునీరు వస్తే కొంత మేరకైనా బయటపడతామని, లేదంటే పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు తెలిపారు.
వ్యవయసాయం చేయాలంటేనే భయమేస్తుంది. బుధవారం పట్టణ కేంద్రంలో వ్యవసాయం ఎట్లా ఉందని నమస్తే తెలంగాణ విలేకరి అడుగగా.. తనను పొలం వద్దకు తీసుకుపోయి సాగుచేసిన ఐదెకరాల పొలాన్ని చూపించా. ఐదెకరాలలో వరి సాగుచేస్తే, రెండున్నర ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది. ఇందుకు దాదాపు మొత్తం రూ.లక్ష పైనే ఖర్చులు అయింది. మిగిలిన రెండున్నర ఎకరాలు కూడా పండుతుందో, ఎండుతుందో తెలియని పరిస్థితి. ఈ సంవత్సరం ఎక్కువగా వర్షం కురిసింది. పంటలు బాగా పండుతాయనే ఆలోచనతో ఐదు ఎకరాల వరిసాగు చేసి, తీవ్రంగా నష్ట పోయా. భూగర్భజలాలు అడుగంటడమే ఇందుకు కారణం. గత ప్రభుత్వ(బీఆర్ఎస్) హయాంలో ఇంత నష్టం రాలేదు. ఈ ప్రభుత్వానికి ముందుచూపు
లేకపోవడంతోనే పంటలు నష్టపోతున్నాం.
– సత్తూర్ సత్తయ్యగౌడ్, రైతు, భూత్పూరు
ఈ ఏడాది నీటి విడుదలలో సమస్యలు ఉన్న మాట వాస్తవమే. ప్రస్తుతం డీ-31 కాల్వ వరకే ప్రతి మంగళ, బుధవారాల్లో వారబంధిపై సాగునీటిని విడుదల చేస్తున్నాం. డీ-32 నుంచి 38 వరకు రైతులు నీటి
విడుదల చేయాలంటూ కోరుతున్నా నీటి లభ్యత లేదు.
– సిద్ధయ్య, ఏఈ