ధన్వాడ, మార్చి 7 : రోజురోజుకు ఎండలు ముదురుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీనికి తోడు కరెంట్ కోతలు సైతం వేధిస్తుండడంతో పంటలకు సాగునీరు అందక రైతులు అవస్థలు పడుతున్నారు. మండలంలోని పాతపల్లి, మందిపల్లి గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరి పంటలు సాగు చేయగా ప్రస్తుతం బోరులో నీరు ఇంకిపోవడమే కాకుండా కరెంట్ కోతలతో పారిన మడే పారడంతో సగానికి సగం పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది.
పాతపల్లి గ్రామంలో రైతు వెంకయ్య రెండు ఎకరాల్లో అర ఎకరంలో ఉల్లి, మిగతా ఎకరన్నరలో వేరుశనగ పంటను సాగు చేశాడు. అయితే బోరులో నీటిమట్టం తగ్గడంతో వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోయింది. అదేవిధంగా అర ఎకరంలో వేసిన వరికి కూడా నీరు అందక ఎండిపోవడంతో చేసేది లేక గొర్రెలు మేతకు వదిలిపెట్టాడు. ఇదే పరిస్థితి గ్రామంలో చాలా మంది రైతులు ఎదుర్కొంటున్నారు.
నాకున్న రెండు ఎకరాల్లో ఉల్లి, వేరుశనగ పంటను సాగు చేశాను. కానీ బోరు ఎండిపోవడంతోపాటు కరెం ట్ కోత వల్ల పంటలు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో పెట్టుబడికి తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావ డం లేదు. ప్రభుత్వం ఎండిపోయిన పంటలను అధికారులు పరిశీలించి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి.
– వెంకటయ్య, రైతు, పాతపల్లి