మహబూబ్‌నగర్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ‘ఒకప్పుడు పాలమూరు వలసల జిల్లా.. కరువు జిల్లా.. ఆకలి చావుల జిల్లా.. ఉద్యమ సమయంలో నేను, జయశంకర్ సారు, లక్ష్మారెడ్డి కలిసి తిరుగుతుంటే కండ్లళ్ల నీళ్లు వచ్చేవి.. కానీ, తెలంగాణ వచ్చినంక పాలమూరు స్వరూపమే మార్చినం.. రూ.9,500 కోట్ల పెట్టుబడితో అమర్‌రాజా ఫ్యాక్టరీ ఇక్కడకు వచ్చింది.. పాలమూరు పారిశ్రామిక హబ్‌గా మారబోతున్నది’ అని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందుకు అనుగుణంగానే దివిటిపల్లి వద్ద ఏర్పాటు చేసిన ఐ టీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్షరింగ్ క్లస్టర్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వచ్చే నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఐటీ టవర్‌లో బిల్డింగ్ నిర్మాణం పూర్తి కావచ్చింది. ఉత్సాహవంతులైన పారిశ్రామిక సంస్థలకు ఇందులో తక్కువ రేటుకు స్పేస్ కేటాయిస్తారు. కాగా, దేశంలోనే అతి పెద్ద లిథి యం బ్యాటరీ మ్యానుఫ్యాక్షరైన అమరరాజా కంపెనీ మంత్రి కేటీఆర్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నది. ఈ ఫ్యాక్టరీకి సుమారు 150 ఎకరాల వరకు స్థలాన్ని కేటాయించనున్నట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఇదిలాఉండగా, కంపెనీ ప్రతినిధులు, ప్ర భుత్వానికి కుదిరిన ఒప్పందం ప్రకారం త్వరలో ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. అందుకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు అధికారులు ముందస్తుగానే చేపడుతున్నారు. కంపెనీలకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను కల్పించేదిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఐటీ పార్కులో ఏర్పాటు చేసే పరిశ్రమల కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రెండు రోజుల కిందట సమీప గ్రామాల ప్రజలతో కలిసి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. చిన్నచిన్న అంశాలు లేవనెత్తిన ప్రజలు ఇక్కడ ఏర్పాటు చేసే కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు ఇవ్వాలని మేజర్‌గా డిమాండ్ చేశారు. దీంతో కలెక్టర్ వెంకట్రావు తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదించారు. సున్నితమైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ప్రజాభిప్రాయ సేకరణ చాలామటుకు అనుకూలంగా రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
పాలమూరు జిల్లాలో పరిశ్రమలు స్థాపించాలన్న ఆలోచన ఉమ్మడి రాష్ట్రంలో పాలకులకు రాకపోవడంతో అనేక మంది మహానగరాలకు వలస బాటపట్టారు. సరైన అవకాశాలు రాకపోవడంతో చాలామంది ఇతర రాష్ర్టాల్లో ఉన్న ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. మరికొంతమంది ఇంటిపట్టునే ఉన్నా రు. తెలంగాణ వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మం త్రి శ్రీనివాస్‌గౌడ్ చొరవతో మహబూబ్‌నగర్ జిల్లాలో ఐటీ పా ర్కు కోసం 44వ నంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఎదిర, దివిటిపల్లి గ్రామాల మధ్య సుమారు 400 ఎకరాలు సేకరించారు. అందులో కొంత ప్రైవేట్ ల్యాండ్ కావడంతో పరిహారం చెల్లించారు. దివిటిపల్లి వద్ద ఐటీ పార్కు నిర్మాణానికి జూలై 7, 2018లో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.50 కోట్లతో టవర్ నిర్మాణానికి అక్టోబర్ 31, 2019లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శంకుస్థాపన చేశారు. సుమారు 50 వేల స్కార్ ఫీట్ల ఏరియాలో నిర్మించే టవర్‌లో కంపెనీలు తమ వ్యాపార సముదాయలను ఏర్పాటు చేసుకోవచ్చు. 400 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఐటీ పార్కులో ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్షరింగ్ కంపెనీలకు కూడా స్థలం కేటాయించనున్నారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 వేల మందికి ఉద్యోగావకాశాలు ల భించనున్నాయి కరోనా కారణంగా పనులు ఆలస్యమమ్యాయని, 2023 జనవరి నాటికి ఐటీ టవర్ అందుబాటులోకివస్తుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల ట్విట్టర్లో పెట్టారు.
అమరరాజా కంపెనీ ఆధునిక టెక్నాలజీతో అడ్వాన్స్డ్ సెల్ కెమిస్ట్రీ (ఏసీసీ)ని దివిటిపల్లి వద్ద తయారుచేయన్నారు. ఇది దేశంలోనే మొట్టమొదటి లిథియం ఆయన్ సెల్ తయారీ కేం ద్రంగా మారనున్నది. మహబూబ్‌నగర్ జిల్లాలో తయారు చేసే లిథియం సెల్ గిగా ఫ్యాక్టరీలో 16 జీడబ్ల్యూహెచ్ వరకు అంతి మ సామర్థ్యం కలిగి ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. 5 జీడబ్ల్యూ వరకు బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ యూనిట్ స్థాపిస్తుందన్నారు. అంతేకాక అమరరాజా బ్యాటరీ యూనిట్ దశల వారీగా పెట్టుబడిని పదేండ్లల్లో రూ.9,500 కోట్లు పెట్టాలని భావిస్తున్నది. ప్రత్యేకంగా తయారు చేసే లిథియం ఆయాన్ సెల్లతో వాహనాల్లో విద్యుత్ శక్తిని తక్కువగా ఉపయోగించి ఎక్కువ సామర్థ్యం పొందే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే టూవీలర్, త్రీవీలర్లకు లిథియం బ్యాటరీ బ్యాకప్‌లు, ఛార్జర్లు సరఫరా అవుతున్నాయి. భవిష్యత్‌లో కొత్త టెక్నాలజీ ఉపయోగించి ఈ బ్యాటరీలను తయారుచేసేందుకు అమర్‌రాజా కంపెనీ ముందుకొచ్చింది.
దివిటిపల్లి ఐటీ పార్కులో ఏర్పాటు చేసే కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించేలా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చొరవ తీసుకుంటున్నారు. దివిటిపల్లి, ఎదిర గ్రామాలకు చెందిన యువతకు ఉపాధి కల్పించాలని ఆదేశించారు. ఈ విషయాన్ని కలెక్టర్ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రకటించారు. అంతేకాకుండా ప్రత్యేక తీర్మానం చేసి పంపిస్తామని హామీ ఇ చ్చారు. దీంతో ఈ రెండు గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా భూములు కోల్పోయిన వారికి అత్యధికంగా పరిహారం ఇవ్వడమే కాకుండా ఉద్యోగాల కల్పనలో స ముచిత స్థానం కల్పించనున్నారు. కొంతమంది మాత్రం లిథియం కంపెనీ వల్ల పర్యావరణం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కవ మొత్తంలో పొల్యూషన్ రా కుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతామని పీసీబీ అధికారు లు వెల్లడించారు. అయితే, లిథియం కంపెనీ రావడం ఇష్టం లేని బీజేపీ, కాంగ్రెస్ నాయకుల దుష్ప్రచారాన్ని నమ్మొద్దని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పాలమూరు జిల్లాపై ఉన్న ప్రేమాభిమానాలకు అమరరాజా బ్యాటరీ కంపెనీ భారీ పెట్టుబడులే నిదర్శనం. తెలంగాణ వచ్చాక జిల్లా స్వరూపమే మారింది. ఇక్కడ ప్రజలకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే నా తపన.. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది. ఇక్కడి ప్రజలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలన్న ఆలోచనతోనే కేసీఆర్‌ను ఒప్పించి ఐటీ టవర్‌ను తీసుకొచ్చాం. టవర్ పూర్తయినందున పాలమూరుకు పెట్టుబడులు రానున్నాయి. ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడనున్నాయి.
– శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి