ఉప్పునంతల, జూన్ 26 : ప్రభుత్వం పాలబిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ మండలకేంద్రంలోని పోశమ్మ చౌరస్తాలో బుధవారం విజయ పాడి రైతులు ఆందోళన నిర్వహించారు. అదేవిధంగా రోడ్డుపై పాలు పోసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అ చ్చంపేట పాలశీతలీకరణ కేంద్రం చైర్మన్ గో పాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రెండు నెలలుగా పాల బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిలో పాడి రైతులు ఉన్నారని, కేవలం విజయ పాల డెయిరీని మాత్రమే నమ్ముకొని ప్రైవేట్ డెయిరీ ప్రలోభాలకు లొంగకుండా విజయ డెయిరీని ప్రోత్సహిస్తున్న పాడి రైతులకు ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించి ఆదుకోవాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సకాలంలో బిల్లులు వచ్చేవని, ఇప్పుడు ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదన్నారు.
అనంతర నడింపల్లి రమేశ్‌గౌడ్ మాట్లాడుతూ పాడి పరిశ్రమ నిర్వహిస్తూ వచ్చిన డబ్బులతో తన పిల్లలను చదివించుకుంటున్నానని, సకాలంలో డబ్బులు రాకపోవడంతో పిల్లల ఫీ జులు కట్టలేకపోతున్నామన్నారు. ఇంటి అద్దె, బిల్లులు కూడా చెల్లించకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికీ రూ.లక్ష, రెండు లక్షలు బిల్లులు రావాల్సి ఉందన్నారు. పాల బిల్లు రాకపోవడంతో ప్రైవేట్ వ్యక్తులతో అప్పు తీసుకుంటున్నామని తెలి పారు. మరో రైతు సంతోష్‌రెడ్డి మాట్లాడుతూ రూ.2లక్షలు రా వాల్సి ఉందని, బిల్లుల కోసం ఎదురుచూస్తున్నానని వాపో యాడు. ఉప్పునుంతలలో దాదాపు రూ.60 లక్షల నుంచి 70 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో పాడి రైతులు చీమర్ల జంగిరెడ్డి, సంతోష్‌రెడ్డి, లింగమయ్య, పర్వతాలు, శివశంకర్, రాములు, శేఖర్, రామకృష్ణ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
కేవలం పాడినే నమ్ముకొని బతుకుతున్నాం. దాదాపు లక్ష రూపాయల బిల్లులు రావాల్సి ఉంది. నాలుగు విడుతలుగా బిల్లులు రావడం లేదు. పాలను నమ్ముకొని చీటీలు వేశాను. బిల్లు రాకపోవడంతో చీటీలు కట్టలేకపోతున్నా. తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేసి ఆదుకోవాలి.