‘మన ఊరు-మన బడి’తో మౌలిక సదుపాయాలు
టీఎస్ ఈడబ్ల్యూ ఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి
బాలానగర్, మే 22 : ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి ఎంపికైన పాఠశాలల్లో అన్ని వసతులను కల్పించాలని టీఎస్ ఈడబ్ల్యూ ఐడీసీ (రాష్ట్ర విద్యా, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ) చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి ఆదేశించారు. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమానికి ఎంపికైన మండలంలోని చెన్నంగులగడ్డతండా పాఠశాలను ఆదివారం ఆయన సందర్శించారు. బడిలో ప్రారంభించిన పనులను పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని తెలిపారు. విద్యార్థులకు కావాల్సిన ఫర్నిచర్, తరగతి గదులు, పాఠశాలలకు ప్రహరీ, మరుగుదొడ్లు, డైనింగ్ హాల్ వంటి సదుపాయాలతో ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. అంతకుముందు గ్రామంలో పర్యటించి అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. జీపీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సర్పంచ్ రవినాయక్‌ను సన్మానించి అభినందించారు. అంతకుముందు గౌతాపూర్‌లో ప్రభుత్వ పాఠశాలను కూడా సందర్శించారు. ఆయన వెంట అధికారులు, సర్పంచులు రమేశ్, రవినాయక్, టీఆర్ఎస్ నాయకులు భూపాల్‌రెడ్డి, యాదయ్య, వార్డు సభ్యులు ఉన్నారు.