Timmajipeta | తిమ్మాజిపేట, జూన్ 3 : తిమ్మాజిపేట మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేరాలని కోరుతూ కళాశాల అధ్యాపకులు మంగళవారం తిమ్మాజిపేటలో ప్రచారం నిర్వహించారు. ఇటీవల పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల నివాసాలకు వెళ్లి వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. తమ కళాశాలలో మౌలిక వసతులు ఉన్నాయని, అనుభవమైన అధ్యాపకులు ఉన్నారని వారు తెలిపారు. ప్రభుత్వం ఉచిత విద్య, పాఠ్యపుస్తకాలను అందిస్తుందని తెలిపారు.
కళాశాలలో తెలుగుతోపాటు ఇంగ్లీష్ మీడియం ఉన్నదని, ఎంపీసీ, బైపీసీ, సీఈసీ అడ్మిషన్లు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటుకు వెళ్లి వేలాది రూపాయలు ఫీజులు చెల్లించి నష్టపోవద్దని, ప్రభుత్వ కళాశాలలోని నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. విద్యార్థులను ప్రభుత్వ కళాశాలలోనే చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వెంకన్న, వెంకటయ్య, విజయలక్ష్మి, శ్రీనివాసరావు, జంగయ్య, కిరణ్, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.