అయిజ, మే 21 : మొక్కజొన్న రైతులను కష్టాలు వీడటం లేదు. యాసంగిలో పండించిన మొక్కజొన్న కొనుగోలు సర్కారు ఆలస్యంగా చేపట్టి కొనుగోలు చేసి నెల రోజులు కావస్తున్నా తరలింపులో జాప్యం ఏర్పడుతుంది. దీంతో రైతులను వరుస కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. రైతుల నుంచి కొనుగోలు చేసిన మక్కల బస్తాలు తరలించడంలో తాత్సారం జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలకు మొక్కజొన్న ధాన్యం తడుస్తుండడంతో అన్నదాతలు నష్టపోయే అవకాశం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
కొనుగోలు చేసిన మక్కల బస్తాల రక్షణకు రైతులు మార్కెట్లోనే కాపల కాస్తున్నారు. సర్కారు నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో రైతులు రేయింబవళ్లు పడిగాపులు కాసేలా చేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలకు మొ క్కజొన్న తరలించిన రైతులు అడుగడుగునా కష్టాలు పడుతున్నారు. కాంటా వేయడంలో ఆలస్యం, హమాలీల సమస్య, లారీల కొరత, గోదాంల కొరత, తూకంలో తరుగు వంటి సమస్యలతో రైతులు సతమతమయ్యారు. లారీల కొరత ఏర్పడటంతో సొంత వాహనాల్లో మక్కల బస్తాలను తరలించుకోవాలని అధికారులు సూచించడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
సొంత వాహనాలు లేని రైతులు సర్కారు లారీలో ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురించింది. అయిజ మార్కెట్లో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రంలో 1,756 మంది రైతుల దగ్గర నుంచి 2,13,232 బస్తాల మక్కలను కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు 1,75,987 బస్తాలను గోదాంలకు తరలించారు. మరో 37,305 బస్తాల మక్కల నిల్వలు మార్కెట్లో మగ్గుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న ధాన్యం సర్కారు కొనుగోలు చేసినా తరలించికపోవడంతో నెల రోజులుగా మార్కెట్లోనే రైతులు కాపలా కాస్తున్నారు. ఎంతకాలం మార్కెట్లో కాపలా ఉండాలని రైతులు ఆవేదన చెందుతున్నారు.
మార్కెట్ యార్డులో రైతుల వద్ద సేకరించిన మొక్కజొన్న పంటను గోదాముల్లోకి తరలించడంలో జాప్యం జరుగుతున్నది. మార్కెట్ల్లో 2,13,232 బస్తాల మొక్కజొన్న పంటను కాంటావేసి సంచుల్లో నింపిన లారీలు, హమాలీల కొరత కారణంగా గోదాముల్లోకి తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. రైతుల పంటను కాంటా చేసిన పీఏసీసీఎస్ సిబ్బంది వారికి కొనుగోళ్ల పత్రాలు ఇవ్వడం లేదు. లారీల్లో లోడ్ చేసిన తర్వాత వివరాల పత్రాలు ఇస్తామని, అప్పటి వరకు ఉండాలని చూచిస్తున్నారు. దీంతో 30 రోజులుగా బస్తాల వద్ద రాత్రి, పగలు కాపలా ఉంటున్నారు. రెండు రోజులుగా మబ్బులతో కూడిన వాతావరణం ఉండడంతో ఎప్పుడు వర్షం పడుతుందో, పంట తడిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.