అలంపూర్ చౌరస్తా, మే 21 : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతన్న అమ్ముకుందామంటే ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా అన్నదాత అధోగతి పాలవుతున్నాడు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి మక్కలు కాంటా వేసి రోజులు గడుస్తున్నా లారీలు, హమాలీలు, గన్నీ బ్యాగుల కొరత అంటూ ప్రతినిత్యం రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్‌యార్డులో గత నెల 17వ తేదీన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అయితే అంతకు ముందే రైతులు మార్కెట్‌యార్డుకు మక్కలను తరలించడంతో మొదట్లో కొనుగోళ్లు గందరగోళంగా మారింది. ముందు వచ్చిన రైతులను కాకుండా రాజకీయ పలుకుబడి ఉన్న వారివే కొనుగోలు చేయడంతో రైతులు ఆందోళన చేయడంతో అధికారులు క్రమసంఖ్య ఆధారంగా కొనుగోలు చేశారు. అయితే యార్డులో 1107మంది రైతులకు సంబంధించిన 84,203 క్వింటాళ్ల మక్కలను తుకాలు వేసి బస్తాలను గోదాంలోకి తరలించారు. అయితే ఇంకా 22వేల క్వింటాళ్ల మక్క బస్తాలు కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉండటంతో రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
ఎంతో కష్టపడి పంటను పండించి మార్కెట్‌యార్డుకు తీసుకొస్తే హమాలీ నుంచి లారీ డ్రైవర్ వర కు అందరూ తలాకొంత దోపిడీ చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొనుగోలు కేంద్రంలో హమాలీలకు క్వింటాకు రూ.65 ఇస్తు న్న అదనంగా ఒక్కో సంచిపై రూపాయి వసూలు చేస్తున్నారు.

అలాగే డ్రైవర్లు కూడా సంచికి రూపా యి, తెలంగాణ లైబుల్ వేయడానికి రూ.1.50 వసూలు చేస్తున్నారు. దీనికి తోడు తరుగు పేరు తో క్వింటాకు 2కేజీలు తీయడంతో రైతన్న నష్టా లు ఎదుర్కొంటున్నారు. కొనుగోలు కేంద్ర ంలో ఇంత అవినీతి జరుగుతున్నా అధికారులు మా త్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని రైతులు వాపోయారు.
మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో గన్నీ బ్యాగు ల కొరతతో రైతులు నానా అవస్థలు పడి కర్నూల్‌కు వెళ్లి రూ.30 పెట్టి గన్నీ బ్యాగులు తెచ్చుకొని మక్కలను కాంటాలు వేస్తే లారీలు, హమాలీ కొరతతో రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. రోజుల తరబడి పంటకు ముందే కాపాలకాస్తూ ఏ క్షణంలో వర్షం పడుతుందోనని అనుక్షణం భయం భయంతో కాలవేలదీస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్‌యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలోని మక్కబస్తాలను గోదాంలోకి తరలించకుండా రైతులను ఇ బ్బందులు గురి చేస్తున్నారని ఎమ్మె ల్యే విజయుడుకి సమాచారం రావడంతో ఈనెల 11వ తేదీన కొనుగోలు కేంద్రానికి ఆయన వెళ్లి పరిశీలించారు. యార్డులో ఎక్కడ చూసినా మక్క బస్తాలు ఉండడంతో అక్కడే ఉండి రైతుల సమస్యలను అడిగితెలుసుకున్నారు. మక్క బస్తాలను తరలించకుంటే రైతులతో కలిసి ధర్నా చేస్తామని హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం కదిలింది. అదనపు కలెక్టర్లు, ఆర్డీవో లు, మార్కెటింగ్ అధికారులు కొ నుగోలు కేంద్రానికి వచ్చి మక్క బస్తాలను తరలించారు. ఇంకా 22వేల క్వింటాళ్ల మక్క బస్తాలు యార్డులోనే ఉన్నాయని రైతులు వాపోయారు.
నాకున్న 3.5ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేయగా 60క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. నెలరోజుల కిందట అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్‌యార్డులోని కొనుగోలు కేంద్రానికి మక్కలను తీసుకొచ్చాను. నెల నుంచి ప్రతి రోజూ అధికారులకు వేడుకుంటున్నా ఒక్క అధికారి కూడా కనీకరం చూపడం లేదు. నెల నుంచి పంటను కాపాడుకుంటూ పంట వద్దే కాపలా కాస్తూ ఇక్కడే మకాం వేశాను. నా సీరియల్ నెంబర్ వచ్చినా హమాలీలు, లారీల కొరత వల్ల రోజులు గడుస్తున్నా మక్క బస్తాలు యార్డులోనే ఉన్నాయి. వర్షం పడితే పంట మొత్తం దెబ్బతిని పూర్తిగా నష్టం జరుగుతుంది. అయితే అధికారులు రాజకీయ పలుబడి ఉన్న వారివి మాత్రం సీరియల్ నెంబర్ లేకుండానే మక్క బస్తాలను తరలిస్తున్నారు. ఎలాం టి రాజకీయ పలుకుబడి లేని మాలాంటి రైతులవి మాత్రం బస్తాలను తరలించకుండా ఇబ్బందులు పెడుతున్నారు.
– రామచంద్రుడు, రైతు, మారమునగాల