ఊట్కూర్, మే 2 : రైతులను యాసంగి కష్టాలు వెంటాడుతున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటలను కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో కొనేందుకు దిక్కులేక కల్లాల్లోనే కుప్పలుగా పేరుకుపోతున్నాయి. జిల్లాలో పేరుకు మాత్రమే అధికారులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం చూపుతున్నారు. ధాన్యాన్ని కల్లాల్లో ఆరబెట్టిన రైతులకు గన్నీ బ్యాగులు అందజేయడం లేదు. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు మాయిశ్చర్ చెక్ చేసిన తర్వాతే గన్నీ బ్యాగులు అందజేస్తామని చెప్పడం, వడ్ల కొనుగోలుకు ఆంక్షలు పెట్టడంతో అధికారుల నిర్లక్ష్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి, కష్టపడి వరి పంట పండిస్తే కొనుగోలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
వరి పంట కోసి ఎండ బెట్టి కల్లాల్లో కుప్పలు పోసి 15 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లపై స్పష్టత లేదని, ధాన్యం బస్తాలు కల్లాలు దాటడం లేదని మండి పడుతున్నారు. జిల్లాలో ప్రవహిస్తున్న కృష్ణా, భీమా నది పరివాహక ప్రాంతాలతోపాటు భూత్పూర్, సంగంబండ, కోయిల్‌సాగర్ రిజర్వాయర్లు, ఎత్తిపోతలు, బోరు బావులను ఆసరాగా చేసుకుని జిల్లా వ్యాప్తంగా 1.90లక్షల ఎకరాల్లో రైతులు యాసంగి వరిసాగు చేపట్టారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయం అందించకపోగా సాగుకు అవసరమైన యూరియా, ఎరువులు సమయానికి అందకపోవడం, కరెంట్ కోతలు, సాగునీటి ఇబ్బందులతో పంట దిగుబడి తగ్గింది. చేతికి అందిన పంటను అమ్ముకునేందుకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో అత్యధికంగా మాగనూర్, కృష్ణ ఉమ్మడి మండలాల్లో 32,937 ఎకరాల్లో రైతులు వరి పంట ను సాగు చేశారు. మక్తల్ మండలంలో 31,937, నర్వ 17, 492, నారాయణపేట 16,987, మరికల్ 16,780, దామరగిద్ద 16,669, మద్దూర్ 13,933, ధన్వాడ 10,782, కోస్గి 10,538, గుండుమాల్ 8,324, కొత్తపల్లి 6807, ఊట్కూర్ మండలంలో 6,500 ఎకరాల్లో వరి సాగైంది. ఇప్పటికే డబ్బు శాతం వరికోతలు పూర్తి కావడంతో వాతావరణంలో వస్తున్న మార్పులకు రైతులను ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళ మబ్బులు కమ్ముకోవడం, ఉరుములు, మెరుపులతో వర్షం వస్తుందన్న భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 161 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా 1, 60, 000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు కేవలం 10,000క్వింటాళ్ల వరి ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సరైన వసతులు లేకపోవడంతో గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులతో ఆందోళన చెందుతున్న రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులు, రైస్ మిల్లర్ల యజమానులు కల్లాల వద్దకు చేరుకొని తేమ, నాణ్యత ప్రమాణాల పేరుతో రైతును నిట్టనిలువున దోచేస్తున్నారు. మక్తల్, కృష్ణ, మాగనూర్ మండలాల నుంచి ప్రతిరోజూ వేల క్వింటాళ్లలో ధాన్యం బస్తాలు కర్ణాటకలోని రాయిచూర్‌కు తరలిపోతున్నాయి. వ్యాపారులు క్వింటాకు రూ. 2,000 నుంచి రూ. 2,400 వరకు ధర నిర్ణయించి 60 కేజీల బస్తాకు కేజీ తరుగు, రూ. 1నుంచి రూ. 2 వరకు కమీషన్ నిర్ణయంతో కొనుగోళ్లు చేస్తున్నారు.
వడ్లు కుప్పలు పోసి 15 రోజులు అవుతుంది. మండుటెండలో వడ్లు ఉం టున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులతో వర్షం వస్తుందన్న భయం ఉంది. వడ్లు కొనుగోలు చేసేందుకు అధికారులు పట్టించుకోవడం లేదు. అప్పులు చేసి పంట పండిస్తే కాంటా చేసే దిక్కు లేదు. గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముతున్నా, కమీషన్, తరుగు తీస్తున్నారు. మిల్లర్ల వద్దకు వడ్లు తోలేందుకు రూ.4వేలు ట్రాక్టర్ కిరాయి అదనపు భారం అవుతుంది.
– తాయప్ప, రైతు, ఉప్పర్‌పల్లి