వనపర్తి, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : పదేళ్లుగా తె లంగాణలో వ్యవసాయం అంటే వరి సాగుబడులు అన్నట్లుగా మారిపోయింది. ఉమ్మడి పాలమూరులో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయడంతో అన్నపూర్ణగా మారడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. పెరిగిన సాగునీటి వనరుల ఆధారంగా వరి సాగు వైపు రైతులు ఆసక్తి చూపుతూ వచ్చారు. గడిచిన 60, 70 ఏండ్లుగా నదుల నీటిని ఎరుగని రైతన్నలకు వ్యవసాయం పండుగైంది. గత పదేళ్లుగా కేసీఆర్ హయాంలో సజావుగా ధా న్యం కొనుగోళ్లు జరగడంతో రైతులు వరి పై మరింత మక్కువ చూపుతూ వచ్చా రు.
దీంతో అధిక విస్తీర్ణంలో ఈ పంట సాగుతో దేశంలో నెంబర్‌వన్ స్థానానికి రాష్ట్రం ఎదిగింది. అయితే జోరు మీ దున్న రైతన్నకు ప్రస్తు త కాంగ్రెస్ స ర్కారు వరి సాగుబడులకు సంకెళ్లు వేసింది. వరి పంట సాగులో కేవలం 8 రకాల వంగడాలను మాత్ర మే వేయాలని ఫిక్స్ చేశారు. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటల సాగుకు ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వకుండానే రైతులను వరికి దూరం చేయాలనుకోవడం సర్కారు కొత్త సమస్యను కొని తెచ్చుకున్నట్లేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతలు ప్రతిఏటా సాగు చేసినట్లుగానే.. ప్రస్తుతం కూడా అదే పద్ధతిని అవలంభిస్తున్నారు.
కొత్తగా చేసిందేమీ లేదు.. రేవంత్ సర్కారు సన్నాలకు రూ.500 బోనస్ ప్రకటించినా సాగులో పెద్దగా మార్పు లేదు. కేవలం బోనస్ కోసమే సన్నాలు పండించాలనే స్వభావం ఉన్న రైతులు చాలా తక్కువ. రైతుకున్న నీటి వనరు ఆధారంగానే సన్న రకం లేదా దొడ్డు రకం వేయాలని రైతు నిర్ణయించుకుంటాడు తప్పా బోనస్ కోసం ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం సూచించిన 8 రకాల వంగడాలు సాగు చేసిన వారికే బోనస్ ఇస్తామని ప్రచారం జరుగుతుండడంతో అన్నదాతలు విస్మయానికి గురవుతున్నారు. ప్రభుత్వం సూచించిన విత్తనాలు మార్కెట్లో దొరకడం ఒక ఎత్తయితే.. సాగు సమయంలో తెగుళ్ల పరిస్థితులపైనా రైతులకు అనేక అనుమానులు వ్యక్తమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సన్నరకాలు సాగు చేస్తే లాభాల కన్నా.. నష్టాలే ఎక్కువగా వస్తాయని మరికొందరు రైతులు వాపోతున్నారు.
వనపర్తి జిల్లాలో ఈ వానకాలం సీజన్లో 2.32 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గడిచిన యాసంగి సీజన్లోనూ ఇం చుమించు (10 వేల ఎకరాలు తక్కువ) ఇదే స్థాయి లో వరి సాగుబడులను చేపట్టారు. ఈ మేరకు దొడ్డు రకం వరి ధాన్యం 2,07,460 మెట్రిక్ టన్నులు, అలాగే సన్న రకం లక్షా 91 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అగ్రికల్చర్ అధికారులు అంచనా వేశారు. మొత్తం 3.50 లక్షల మెట్రిక్ టన్నులు లక్ష్యంగా ప్రస్తుత యాసంగి సీజన్ నడుస్తున్నది. ఇప్పటి వరకు కేవలం 2,14,708 క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ప్రభు త్వం నూతనంగా రైతులకు పరిమిత వంగడాలను కేటాయించి వ్యవసాయశాఖ ద్వారా ప్రచారం చేయిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. వీటిలో 1) బీపీటీ-5204 (సాంబమసూరి), 2) ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సోనామసూరి), 3) కేఎన్ఎం-1638 (కూనారం వరి-2), 4) జైశ్రీరామ్, 5) హెచ్ఎంటీ సోనా, 6) డబ్ల్యూజీఎల్-962, 7) డబ్ల్యూజీఎల్-44(సిద్ది), 8) జేజీఎల్-1798 (జగిత్యాల సన్నాలు) రకాలు మాత్రమే ఉన్నాయి.
రైతులు 33 రకాలలో ఏ రకం వరి వంగడాలు సాగు చేసినా బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం రెండేళ్ల కిందట రైతులకు ఆశలు కల్పించింది. మళ్లీ ఇప్పుడు మాట మార్చి ఈ సీజన్లో 8 రకాలను మాత్రమే ప్రతిపాదించడం పలు విమర్శలకు దారితీస్తున్నది. నిర్ణయించిన విత్తనాలకే మార్కెట్లో డిమాండ్ ఉన్నదని, దానికి తోడు దిగుబడులు బాగా వస్తాయన్న ప్రచారం చేస్తున్నది. ప్రభుత్వం చెబుతున్నవి కాకుండా మార్కెట్లో నాణ్యమైన వంగడాలు, అధిక దిగుబడినిచ్చే రకాలు అనేకం ఉన్నాయని రైతులు చెబుతున్నారు. బోనస్‌కు రైతులను దూరం చేయాలని కొత్త నిబంధనలు పెడుతున్నారని రైతు లు విమర్శలకు దిగుతున్నారు. దొడ్డు రకాలు సాగు చేస్తే ఎకరంలో 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, అదే సన్నాలు ఎకరంలో 15 నుంచి 20 క్వింటాళ్లలోపు మాత్రమే పం ట వస్తుందని ఉ దహరిస్తున్నారు.
సన్న రకాల సాగులో అనేక సమస్యలు ఉన్నా యి. వానకాలంలో వర్షాలు అధికంగా ఉండటం, చెరువులు, కాల్వల్లో నీరు పారనుండడంతో విధిలేని పరిస్థితుల్లోనే సన్నాలు సాగు చేస్తాం. వరి కోతలప్పుడు ఇబ్బంది అవుతుందని కూడా పెట్టాల్సి వస్తుంది. అలాంటిది మళ్లీ ఈ రకాలే వేయాలి అని చెప్పడం ఎలా? దొడ్డు రకాల కు సమస్యలు తక్కువ. రోగాలు తక్కువ, దిగుబడి ఎక్కువ. దొడ్డు రకాల సాగు నుంచి సన్న రకాల వైపు దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం 33 రకాల సన్నాలకు బోనస్ ఇస్తామని రెండేళ్ల కిందట చెప్పింది. అంతలోనే మాట మార్చింది.
– కావలి కృష్ణయ్య, బుద్ధారం గ్రామం, గోపాల్పేట మండలం
రైతులు ప్రతి ఏటా సాగు చేసే రకాలనే ప్రభుత్వం గుర్తించింది. రైతులకు మేలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నది. ఇందులో కొత్తగా చేస్తున్నదేమీ లేదు. అందుబాటులో ఉండే వరి రకాలనే సర్కారు సూచిస్తుంది. దీనిపై రైతులు అపోహలకు లోనుకావద్దు. మంచి వంగడాలు, బాగా దిగుబడులు వచ్చే వాటినే సూచించడం తప్పా మరోటి లేదు. మేలైన రకాల పంట సాగుతో రైతులకు లాభం చేకూరుతుంది. మంచి దిగుబడి సాధించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం.
– ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి, వనపర్తి
36 రకాల వంగడాలను ఎందుకు ఉత్పత్తి చేశారు. అనేక వ్యవసాయ యూనివర్సిటీలు, శాస్త్రవేత్తల శ్రమను వృథా చేస్తున్నట్లుగా ఉన్నది. రూ.కోట్లు ఖర్చు పెట్టి కొత్త రకం వంగడాలను ఉత్పత్తి చేస్తారు. ఇప్పుడు 8 రకాలే అంటూ షరతులు పెట్టడం ఎలా సమంజసం. రైతుకు అనువైన వంగడాలు చేసుకునేలా అవకాశం ఇవ్వాలి. సాగులో సంకెళ్లు వేసినట్లుగా చేయడం సరైంది కాదు. నిజంగా రైతును ప్రోత్సహించాలి అనుకున్నప్పుడు ఏ రకం వేసినా సరే అన్నట్లు ఉండా లి. అంతే కానీ, ఈ రకాలే వేయాలన్న నిబంధన పెట్టడం రైతులకు సరికాదు.
– వేమారెడ్డి, రైతు, రిటైర్డ్ ఉద్యోగి, మదనాపురం