Narayanapet | నారాయణపేట రూరల్, మార్చి 14: తరాలు మారిన ఈ విద్యార్థుల తలరాతలు మాత్రం మరడం లేదు. అందుకు నిదర్శనం నారాయణపేట మండలం గనిమోనిబండ గ్రామానికి చెందిన విద్యార్థుల సమస్యలే. గ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన విద్యార్థులు పైచదువుల కోసం వెళ్లాలంటే ప్రతిరోజు 14 కిలోమీటర్లు కాలినడకలో వెళ్లాల్సిందే. సొంతూరులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు వరకు ఉంది. ఇక ఆరో తరగతికి వెళ్లాలంటే.. సమీపంలో ఉన్న గ్రామానికి వెళ్లక తప్పని పరిస్థితి. ఇలా ప్రతి ఏడాది 30 నుండి 40 మంది విద్యార్థులు గనిమోనిబండ గ్రామం నుండి పైతరగతులు చదివేందుకు పక్క గ్రామమైన అభంగాపూర్కు వెళ్లాలి. ఈ గ్రామం గనిమోనిబండ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే రానుపోను విద్యార్థులు 14 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి.
మరి కొంతమంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం గనిమోనిబండ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటకొండకు కాలినడకన ప్రయాణం సాగిస్తున్నారు. ఇక్కడ చదివే విద్యార్థులకు రాకపోకలకు మొత్తం 14 కిలోమీటర్లు నడిస్తే తప్ప ఉన్నత విద్యను అందుకోలేమని ఇటు విద్యార్థులు అటు తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రధానంగా గనిమోనిబండ గ్రామం నుండి అభంగాపూర్కు బిటి రోడ్డు సౌకర్యం లేకపోవడం. అభంగాపూర్ నుండి కోటకొండ వరకు బిటి రోడ్డు సౌకర్యం ఉన్న ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడమే విద్యార్థులకు శాపంగా మారింది. ఒకపక్క నిత్యం కాలినడక, ఇంకో పక్క విద్యార్థుల భుజానికి పుస్తకాల మోతతో కుస్తీ పడుతున్నారు.
గనిమోనిబండ గ్రామస్తుల, విద్యార్థుల సమస్యలను అప్పటి మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి స్వయంగా తెలుసుకుని గ్రామానికి బీటీ రోడ్డు వేసేందుకుగాను రూ. రెండు కోట్లతో నిధులు మంజూరు చేయించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రోడ్డు పనులు ముందుకు సాగలేదు. ఇదే క్రమంలో గత ఎన్నికల సందర్భంగా గ్రామానికి బీటీ రోడ్డు వేయిస్తానని ప్రస్తుత ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి హామీ ఇచ్చారు. కాగా ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు రోడ్డు సౌకర్యానికి నోచుకోలేదు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే గ్రామానికి బీటీ రోడ్డు ఏర్పాటు చేసి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.