వనపర్తి టౌన్, జనవరి 6 : ఆన్లైన్ ద్వారా ధని యాప్ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు అమాయకులను లోన్ల పేరుతో రూ.కోట్లకు టోకరా వేసి మోసగించిన కేసును ఛేదించినట్లు ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో ఆన్లైన్ మోసాలకు సంబంధించిన కేసు వివరాలు వెల్లడించారు. వనపర్తి పట్టణానికి చెందిన తొగట రాజు మెకానిక్‌గా పనిచేస్తూ బాల్నగర్లో నివాసం ఉంటున్నాడు. డిసెంబర్ 17న మధ్యాహ్న సమయంలో తాను ఫేస్బుక్ చూస్తుండగా ధని ఫైనాన్స్ యాప్ ప్రకటనను ఓపెన్ చేయగా వెంటనే అతనికి ఫోన్ కాల్ వచ్చింది. ఏమైనా లోన్ కావాలా అని అడుగగా రూ.3లక్షలు కావాలని తాను చెప్పినట్లు తెలిపారు.
రూ.3లక్షలకు గానూ ప్రతి నెలా రూ.8,860 కట్టాలని చెప్పారు. ఇలా 36 నెలలు కట్టాల్సి ఉంటుందని మొదటగా ఇన్సూరెన్స్, పేపర్ డాక్యుమెంట్ల ఖర్చు కింద రూ.6,850ను ధర్మేందర్‌కుమార్ స్కానర్ ద్వారా పంపించాడు. మరికొద్ది సేపటికి రూ.8860లపై ఉన్న స్కానర్ పంపించగా ఒక ఐడీ నెంబర్ రావడంతో మొత్తం రూ.15,710 చెల్లించాడని చెప్పారు. రాత్రికి అకౌంట్లో జమ అవుతాయని అంతవరకు వేచి చూడాలని చెప్పారు. రాత్రి వరకు వేచిచూసిన రాజుకు ఎలాంటి అమౌంట్ జమ కాకపోవడంతో అతను 8:30 గంటల సమయంలో పోన్ చేయగా వారి నుంచి సమాధానం రాలేదు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు వారికి ఫోన్ చేయగా మరికొన్ని డబ్బులు వేయమని చెప్పారు.
వెంటనే అనుమానం వచ్చిన రాజు మోసపోయానని గుర్తించి సైబర్ క్రైం నెంబర్ 1930కి రిపోర్ట్ చేయగా డిసెంబర్ 21న పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికాగోయెల్, వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్, డీఎస్పీ రత్నం, సీఐ కృష్ణ, ఎస్సైలు రవిప్రకాశ్, హరిప్రసాద్‌లు ఉన్నతాధికారుల సూచనల మేరకు విచారణ చేపట్టామని తెలిపారు. ముద్ర, ధని యాప్‌ల ద్వారా రాష్ట్రస్థాయిలో పెద్ద మొత్తంలో కేసులు నమోదు కాగా 35మంది సైబర్ నేరస్తులను గుర్తించామని వారిలో ఏడుగురికి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారిలో గోపాల్పేట మండలం మున్ననూరు గ్రామానికి చెందిన సోడే కృష్ణకుమార్, కొత్త ఆంజనేయులు, జనుంపల్లి నితీశ్‌కుమార్‌రెడ్డి, సోడే బాను, వనపర్తిలోని గాంధీనగర్‌కు చెందిన ఆగుపోగు మహేశ్, పాన్‌గల్ మండ లం మల్లాయిపల్లికి చెందిన నవీన్‌కుమార్‌రెడ్డి, గద్వాల పట్టణానికి చెందిన మోరెడ్డి ఉదయ్‌కుమార్‌రెడ్డి ఉన్నారన్నారు.
వీరందరినీ అరెస్ట్ చేసి విచారించగా కలకత్తా, ఢిల్లీ, పాట్నాలో ఉంటూ అంకిత్, రాహుల్, పంకజ్ వారి సహచరులు చెప్పినట్లు సైబర్ నేరాలకు పాల్పడుతూ డబ్బులు సంపాదిస్తున్నారని, మోసం చేసి అమాయకుల వద్ద సేకరించిన డబ్బు మొత్తంలో వాటాకింద అంకిత్, రాహుల్, పంకజ్లకు 20 నుంచి 30శాతం వరకు ఇవ్వాలని, మిగిలిన డబ్బులను వసతులను కల్పించి సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర సౌకర్యాల కోసం తీసుకునేవారన్నారు.
ముద్ర, ధని లోన్ యాప్‌ల ద్వారా అప్లికేషన్ ఖర్చులు, ఫోన్ నెంబర్, పేరు, చిరునామా, ఈ మెయిల్ కావాలని వివరాలను ఎక్సెల్ ఫైల్‌పై తీసుకొని ఫోన్లో వివరాలను తీసుకొని నమ్మించి లోన్ మంజూరు చేస్తామని నమ్మించి నమ్మబలికి డాక్యుమెంట్ చార్జీలని చెప్పి రూ.10వేల నుంచి రూ.40వేల వరకు తీసుకొని లోన్ మంజూరయిందని పంపేవారన్నారు. సాయంత్రం కాగానే ఫోన్ స్విచ్ఛాప్ చేసేవారన్నారు. బాధితుల నుంచి కొట్టివేసిన డబ్బులో హరీశ్ 70 శాతం తీసుకొని తనవంతుగా 20 శాతం ఉంచుకొని మిగతా 30 శాతం డబ్బులు తన టీమ్ సభ్యులందరికీ అందజేసేవారని చెప్పారు.
ఇలా రెండు తెలుగు రాష్ర్టాల్లో 10వేల నుంచి 15వేల మందికి ఫోన్ చేసి మోసగించారని, దాదాపుగా ఇప్పటికి వెయ్యి మందిని మోసగించి రూ.2కోట్లు ఖాజేశారని చెప్పారు. ఇప్పటి వరకు వచ్చిన డబ్బులు రూ.50లక్షల విలాసాలు, జల్సాలకు ఖర్చు చేసి విమానాల్లో తిరుగుతూ బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లడం, చార్దం తీర్థయాత్రలకు వెళ్లడం, వారు సంపాదించిన ధనాన్ని విలాసాలకు వినియోగించేవారన్నారు. వారి వద్ద నుంచి మొత్తం 6 మొబైల్స్, నాలుగు బైకులు స్వాధీన పరుచుకున్నామని వాటి విలువ రూ.4లక్షల దాకా ఉంటుందని చెప్పారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించినట్లు ఎస్పీ వెల్లడించారు.
అమరచింత యూనియన్ బ్యాంకు దోచుకోవడానికి యత్నం చేసిన ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. వనపర్తి మండలం మెంటెపల్లికి చెందిన అంకిత బీటెక్ పూర్తిచేసి జల్సాలకు అలవాటు పడిన ఆమె గోవా, బెంగుళూరుకు తిరిగి అధిక ఖర్చులు చేసిందని, అదే గ్రామానికి చెందిన జగదీశ్వర్‌రెడ్డిని 2022లో వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత అప్పులు అధికం కావడంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని అదే గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి, నాగరాజు, గణేశ్‌లకు డబ్బు ఆశ చూపించి వారితో కలిసి గద్వాల, నారాయణపేట, మరికల్ ప్రాంతాల్లో బ్యాంకుల్లో దొంగతనాలకు వెళ్లారని ఆయన చెప్పారు. గత నెల డిసెంబర్ 27న బ్యాంకు వెనుకాల కిటికి హుక్కులు తీసి లాకర్‌ను పగులగొట్టేందుకు ప్రయత్నించి విఫలమై సీసీ కెమెరాలు, సీవీఆర్‌ను ఎత్తుకెళ్లారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ నెల 5న కారులో ఉన్న ఐదుగురు నేరస్తులను పారిపోతుండగా పట్టుకొని వారివద్ద ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇటీవల సాంకేతికతను ఉపయోగించిన మోసాలకు, చోరీలకు పాల్పడిన గోపాల్‌పేటలో 3 కేసులు, ఆత్మకూర్‌లో 2, అమరచింతలో 1, వనపర్తిలో ఒక కేసును ఛేదించామని ఎస్పీ తెలిపారు. ఈ కేసులను ఛేదించిన సైబర్ క్రైం డీఎస్పీ రత్నం, ఎస్సై రవిప్రకాశ్, కానిస్టేబుల్ నగేశ్, సత్యం, విజయ్, పోలీస్ సిబ్బందిని అభినందించి నగదు పురస్కారాన్ని అందజేశారు. సమావేశంలో డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐలు నరేశ్, కృష్ణ తదితరులు ఉన్నారు.