Indiramma houses | జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలోని అన్ని మండలాలలో కేటాయించిన ఇందిరమ్మ ఇండ్లలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కురువ విజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ సంతోష్ కు మంగళవారం వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సొంత ఇండ్లు లేని నిజమైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించకుండా కేవలం అధికార పార్టీకి చెందిన నాయకుల వెంట ఉండే సొంత ఇండ్లు ఉన్న వారికే డబ్బులు తీసుకుని లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండే ఇందిరమ్మ కమిటీల నాయకులు ప్రతిపాదించిన వారికే ఇండ్లు కేటాయించి నిజమైన పేదలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల సిఫారసు లెటర్లతో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు చేయడం అంటే ఇది ప్రజాపాలన ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం అంటే ప్రజలందరిదని, ఒక్క కాంగ్రెస్ పార్టీ వారిది కాదనే విషయాన్ని అధికారులు దృష్టిలో ఉంచుకొని ప్రలోభాలకు గురికాకుండా పేదలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పే నాయకులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి పేదలను ఎంపిక చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.