ఉద్యోగాల సాధనకు కేరాఫ్.. గ్రంథాలయాలు
నోటిఫికేషన్ల రాకతో క్యూ కడుతున్న నిరుద్యోగులు
సకల సదుపాయాలు కల్పిస్తున్న లైబ్రరీ సంస్థ
పని గంటలను సైతం పెంచిన సంస్థ చైర్మన్
ప్రశాంతంగా చదువుకునేందుకు అవకాశం
మహబూబ్‌నగర్, మార్చి 12 (నమస్తే తెలంగాణ ప్ర తినిధి) : గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలుగా.. ఉద్యోగాల సాధనకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. ఇక్కడ ప్రిపరేషన్‌కు టెన్షన్ లేకపోవడం.. ప్రశాంత వాతావరణం లభిస్తుండడంతో నిరుద్యోగులకు చక్కని వేదికగా మారాయి. అందుకే యువతీ యువకులు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం వేల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వీరి రాక గణనీయంగా పెరిగింది. వీరికి సదుపాయాలతోపాటు అవసరమైన పుస్తకాలు, మ్యాగజైన్లను లైబ్రరీ సంస్థ ఏర్పాటు చేసింది. ఏ పుస్తకం కావాలన్నా మూడ్రోజుల్లో నిర్వాహకులు సిద్ధంగా ఉంచుతున్నారు. మహిళలకు ప్రత్యేకంగా రీడింగ్ రూం, టాయిలెట్స్ అందుబాటులోకి తెచ్చారు. త్వరలో దాతల సాయంతో అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. సదా మీ సేవలో ఉంటామంటూ పని గంటలను సైతం పెంచారు. దీంతో ఎలాగైనా జాబ్ సాధించాలన్న పట్టుదల పలువురిలో కనిపిస్తున్నది.
చదువును, జ్ఞానాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన గ్రంథాలయాల్లో ఒకప్పుడు సీటు కూడా దొరికే పరిస్థితి ఉండేది కాదు. ఏదైనా మ్యాగజైన్ చదవాలంటే.. ఎదుటి వ్యక్తి చదవడం ఎప్పుడు అయిపోతుందా అని ఎ దురుచూసేవారు. కానీ, సెల్ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక గ్రంథాలయాలతో క్రమంగా అనుబం ధం తగ్గుతూ వచ్చింది. ఉదయం, సాయంత్రం పెద్ద జా తరలా ఉండే గ్రంథాలయాలు కళ తప్పాయి. చదివేందు కు వచ్చేవారు లేక బోసిపోయాయి. అయితే, ఇటీవల కాలంలో ఉద్యోగాల కోసం ప్రిపేరయ్యే నిరుద్యోగులు గ్రంథాలయాలను చక్కటి వేదికగా మార్చుకుంటున్నారు. హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీ, సిటీ లైబ్రరీ మాదిరిగా జి ల్లాల్లోనూ కనిపిస్తున్నది. తాజాగా, సీఎం కేసీఆర్ భారీగా ఉద్యోగాల ప్రకటన చేయడంతో మళ్లీ లైబ్రరీకి వచ్చే నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్నది. ఎలాగైనా ఉద్యోగం సా ధించాలనే కసి స్పష్టంగా కనిపిస్తున్నది. లైబ్రరీల్లో ప్రశాంతమైన వాతావరణం, అవసరమైన పుస్తకాలు, మ్యాగజై న్లు అందుబాటులో ఉండడంతో నిరుద్యోగుల పాలిట వ రంగా మారుతున్నాయి. మహబూబ్‌నగర్ సెంట్రల్ లైబ్రరీతోపాటు రాంనగర్ లైబ్రరీల్లో నిరుద్యోగులు చదువుకునేందుకు క్యూ కడుతున్నారు. వారు ఏ పుస్తకాలు అడిగి నా గంటల్లో తెప్పించడమే కాకుండా లైబ్రరీ పని గంటలను పెంచారు. సాధారణంగా ఉదయం 10 నుంచి సా యంత్రం 5 గంటల వరకు లైబ్రరీ తెరిచేవారు. నిరుద్యోగుల కోరిక మేరకు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు లైబ్రరీలు పనిచేసేలా గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ ఏర్పాట్లు చేశారు.
ఎలాగైనా జాబ్ కొట్టాలి..!
రాష్ట్రంలో ఒకేసారి 80,039 పోస్టులను భర్తీ చేస్తుండడంతో నిరుద్యోగులు ఈసారి ఎలాగైనా జాబ్ కొట్టాల్సిందే అని సిద్ధమవుతున్నారు. ఇంతకంటే మంచి తరుణం మళ్లీ దొరకదని భావిస్తున్నారు. అందుకే చాలా మంది నిరుద్యోగులు గ్రామాల నుంచి పట్టణాలకు చేరుకుని రూం అద్దెకు తీసుకొని కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు. మరికొందరు ప్రశాంతంగా చదువుకునేందుకు లైబ్రరీలను ఆశ్రయిస్తున్నారు. ఉద్యోగాల ప్రకటన తర్వాత మహబూబ్‌నగర్ పట్టణంలోని మెట్టుగడ్డలో ఉ న్న సెంట్రల్ లైబ్రరీకి నిరుద్యోగుల తాకిడి పెరిగింది. ని త్యం సుమారు 200 మంది అక్కడికి వెళ్లి చదువుకుంటున్నారు. రాంనగర్ లైబ్రరీకి సైతం సుమారు 100 మంది వరకు వస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు.
ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్..
ఇంటివద్ద చదువుకునేందుకు అవకాశం ఉన్నా.. ఏకాగ్రత కోల్పోతామని చాలా మంది నిరుద్యోగులు చెబుతునా ్నరు. లైబ్రరీలో మిగతా వారిని చూసి స్ఫూర్తి పొందు తూ చదువుకోవచ్చంటున్నారు. ఉద్యోగ సాధనలో పోటీగానే భావించాలి. పక్కన ఉన్న వారు అంత సీరియస్‌గా చదువుతుంటే తాము ఖాళీగా ఉండలేం కదా.. అందుకే లైబ్రరీని మించిన స్టడీ రూం మాకెక్కడ దొరుకుతుందని నిరుద్యోగులు అంటున్నారు. నిరుద్యోగులు కొనుక్కోలేని పుస్తకాలను కూడా తెప్పిస్తున్నారు. మహిళలకు ప్రత్యేకం గా రీడింగ్ రూం, టాయిలెట్స్ కూడా అందుబాటులో ఉంచారు. ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నిరుద్యోగుల కోసం దాతల సాయంతో త్వరలో అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.
లైబ్రరీ వేళలు పెంచాం..
2016కు ముందు సెంట్రల్ లైబ్రరీలో కనీస వసతులు లేవు. బురద స్వాగతం పలికేది. టా యిలెట్స్ కూడా లేకుండె. అప్పట్లో 50 మందికంటే తక్కువే వచ్చేవారు. నిరుద్యోగుల కంటే సీనియర్ సిటిజన్లే ఎక్కువగా వచ్చేది. ఇప్పుడు చాలా మంది విద్యార్థులు వస్తున్నారు. మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్లు ఏర్పాటు చేశాం. ఫర్నీచర్‌తో సహా అన్ని మార్చేశాం. మెట్టుగడ్డలోని కేంద్ర గ్రంథాలయానికి 200, రాంనగర్ లైబ్రరీకి 100 మంది చదువుకునేందుకు వస్తున్నారు. లైబ్రరీ సమయాన్ని ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు పెంచాం. రోజుకు 12 గంటలు చదివే అవకాశం కల్పిస్తున్నాం. సిబ్బందిని కూడా షిఫ్ట్ పద్ధతిలో వచ్చేలా ప్లాన్ చేశాం. విద్యార్థులకు రీడింగ్ ప్యాడ్స్, రూ.10 లక్షల విలువైన పుస్తకాలు తెప్పించాం. అర్బన్, మండలాల్లోనూ రూ.20 లక్షల విలువైన పుస్తకాలు తెప్పిస్తున్నాం. అక్షయపాత్ర ద్వారా టిఫిన్ అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మధ్యాహ్న భోజనం కూడా సమకూరుస్తాం. ఉద్యోగాలకు ఎంపికైన వారిని సన్మానిస్తున్నాం.
– రాజేశ్వర్‌గౌడ్, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్, మహబూబ్‌నగర్
జాబ్ కోసం కష్టపడుతున్నా
డిగ్రీ చదివాను. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారు. తొలిసారిగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నా. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలపై ఆసక్తితో ఉన్నా. ఊరిలో చదువుకోవడం కష్టమని మహబూబ్‌నగర్‌లో రూం తీసుకున్నాను. రూంలో ఏకాగ్రత కుదరదని.., అనుమానాలను నివృత్తి చేసుకునే వీలు ఉండదని సెంట్రల్ లైబ్రరీకి వెళ్తున్నా. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు చదువుకుంటున్నాను. సీనియర్లతో సందేహాలు నివృత్తి చేసుకుంటున్నాను. లైబ్రరీలో అన్ని పుస్తకాలు, న్యూస్‌పేపర్ అందుబాటులో ఉన్నాయి. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఫిజికల్ టెస్టులకు కూడా ప్రిపేరవుతున్నా.
– ప్రియాంక, చాకల్‌పల్లి తండా, నవాబ్‌పేట మండలం
పెరుగుతున్న పోటీతత్వం
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ అవుతున్నా. నోటిఫికేషన్ వస్తుందనే నమ్మకంతో ఏడాది నుంచి ప్రిపరేషన్ అవుతున్నాను. 2018లో ఒక్క మార్కుతో ఉద్యోగం మిస్సయింది. ఇప్పటికే కోచింగ్ తీసుకున్నాను. ఇప్పుడు సొంతంగా ప్రిపేరవుతున్నా. మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ వద్ద లైబ్రరీలో ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు చదువుకుంటాను. లైబ్రరీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఏ పుస్తకం కావాలన్నా తెప్పిస్తున్నారు. చదివే వాళ్ల మధ్యలో ఉన్నందున పోటీతత్వం పెరుగుతుంది.
– గోపాల్, శాంతినగర్, జోగుళాంబ గద్వాల జిల్లా
ఎస్సై కావాలన్నదే లక్ష్యం
డిగ్రీ పూర్తి చేశాను. ఎస్సై జాబ్ సాధించాలనే లక్ష్యంతో కష్టపడి చదువుకుంటున్నాను. మాలాంటి నిరుద్యోగుల పాలిట లైబ్రరీ వరంగా మారింది. ఉదయం నుంచి రాత్రి వరకు లైబ్రరీలోనే గడిచిపోతుంది. ఉద్యోగం సాధించాలనే మా లక్ష్యానికి లైబ్రరీ చక్కటి వేదికగా నిలుస్తున్నది. సకల వసతులు కల్పిస్తున్నందుకు నిరుద్యోగుల తరఫున గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్‌కు కృతజ్ఞతలు.