పీయూలో రెగ్యులర్ క్లాస్లతోపాటు కోచింగ్
కోటి ఆశలతో కోచింగ్ సెంటర్ల బాట
బుక్స్టాల్స్, లైబ్రరీల వద్ద సందడే.. సందడి
నిపుణుల సలహాలతో ఉద్యోగ వేటకు కసరత్తు
మహబూబ్నగర్, మార్చి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ కోసం సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన యువతలో జోష్ నింపింది. త్వరలో జాబ్ నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో నిరుద్యోగులంతా ఉద్యోగ వేటలో పడ్డారు. ఉమ్మడి జిల్లాలో కొన్ని కోచింగ్ సెంటర్లు ప్రారంభించగా.. ఇప్పటికే కోచింగ్ తీసుకున్న యువత ఇండ్ల వద్దే సంసిద్ధులవుతున్నారు. ఏ కోచింగ్ సెంటర్కు వెళ్లినా.. లైబ్రరీకి వెళ్లినా.. ఉద్యోగార్థుల సందడి నెలకొన్నది. పీయూలో, పార్కుల్లో ప్రశాంత వాతావరణంలో గంటల తరబడి ప్రిపరేషన్లో నిమగ్నమవు తున్నారు. ఇక పాలమూరు యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు తమ రెగ్యులర్ చదువులు కొనసాగిస్తూనే పోటీ పరీక్షలకు కసరత్తు మొదలుపెట్టారు. ఎలాగైనా ఉద్యోగం సాధించుకోవాలన్న లక్ష్యంతో పోటాపోటీగా ఉద్యోగ వేటలో పడ్డారు. నిపుణుల దిశానిర్దేశం మేరకు ప్రిపరేషన్ కొసాగిస్తున్నారు.
స్థానికులకే సింహ భాగం ఉద్యోగాలు దక్కేలా చేసి వెనకబడిన ప్రాంత నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఇన్నాళ్లుగా ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం… త్వరలోనే భారీగా ఉద్యోగ నియామకాలకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 80,039 కొత్త పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి 5 జిల్లాల్లో ఆయా జిల్లా పోస్టులన్నీ కలిపి 4429 జిల్లా స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. జోగుళాంబ జోన్ స్థాయిలో 2190 ఉద్యోగాలకు ఉమ్మడి జిల్లా నిరుద్యోగులు పోటీ పడనున్నారు. మరోవైపు మల్టీ జోన్ 2 (జోగులాంబ, యాదాద్రి, చార్మినార్) పరిధిలో 6370 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లా పరిధిలోని నిరుద్యోగులు వారి వారి జిల్లా పోస్టుల కోసం ప్రయత్నం చేస్తూనే..అటు జోన్ స్థాయి, ఇటు మల్టీ జోన్ 2 స్థాయి ఉద్యోగాలు 8,560 పోస్టులకు పోటీ పడేందుకు అవకాశం ఏర్పడింది. దీంతో ఉద్యోగం సాధించేందుకు ప్రిపరేషన్లో యువత బిజీబిజీగా ఉన్నారు. పీయూలో రెగ్యులర్ తరగతులతోపాటు ప్రభుత్వం తరఫున కోచింగ్ క్లాస్లు నిర్వహిస్తున్నారు. లైబ్రరీలన్నీ నిరుద్యోగులతో సందడిగా కనిపిస్తున్నాయి. నిపుణుల సలహాలు, సూచనలు పాటిస్తూ ప్రిపరేషన్లో మునిగితేలుతున్నారు.
పీయూలోనే కోచింగ్ ఇస్తున్నారు
పీయూలో నేను ఎమ్మెస్సీ జువాలజీ చదువుతూనే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలనే ప్రణాళికతో చదువుతున్నా. పీయూలో ఉచితంగా ఇస్తున్న కోచింగ్ మాకు ఎంతో ఉపయోగంగా ఉంది. రెగ్యులర్ గా అకడమిక్ క్లాసులు వింటూనే ప్రిపేర్ అవుతున్నా. పీయూ క్యాంపస్ లో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునేందుకు అవకాశం దక్కడం మా అదృష్టం. ఎలాగైనా జాబ్ సాధిస్తాననే నమ్మకముంది.
– అరవింద్, ఎమ్మెస్సీ, తనగల గ్రామం, వడ్డేపల్లి మండలం, జోగుళాంబ గద్వాల జిల్లా
ఇంతకంటే మంచి వేదిక ఎక్కడుంది
నేను వాలీబాల్ ప్లేయర్. ఎన్సీసీ కూడా ఉంది. ఎస్సై ఉద్యోగం సాధించేందుకు ఈ రెండూ నాకు ఎంతగానో ఉపయోగపడతాయి. పీయూలో ఉండి చదువుకుంటున్నా. ఇక్కడ ఫ్రెండ్స్ అంతా కలిసి కంబైన్డ్ స్టడీ వల్ల ఒకరి డౌట్స్ మరొకరి ద్వారా తీర్చుకునే అవకాశం ఏర్పడింది. క్యాంపస్లో సకల సదుపాయాలున్నాయి. పైసా ఖర్చు లేకుండా ఇక్కడ చదువుకునేందుకు మాకు అవకాశం లభిస్తోంది. లైబ్రరీ మాలాంటి వారితో కళకళలాడుతున్నది. ఉద్యోగ సాధనకు ఇంతకంటే మంచి వేదిక ఎక్కడుంటుంది.
– అశోక్, ఎంఏ, ఉప్పేరు గ్రామం, ధరూరు మండలం, జోగుళాంబ గద్వాల జిల్లా
మాకోసం లైబ్రరీ వేళలు మార్చారు
నేను పీయూలో ఎమ్మెస్సీ మ్యాథ్స్ చదువుకుంటూ గ్రూప్స్ కోసం ప్రిపేరవుతున్నాను. సాధారణంగా లైబ్రరీ వేళలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయి. కానీ పోటీ పరీక్షల నేపథ్యంలో మేం అర్ధరాత్రి వరకు చదువుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. అలాగే ఇక్కడే ఉచితంగా కోచింగ్ కూడా ఇస్తున్నారు.
– రామాంజనేయులు, ఎమ్మెస్సీ, బొంరెడ్డిపల్లి గ్రామం, కుల్కచర్ల మండలం, వికారాబాద్ జిల్లా