జోగులాంబ గద్వాల : జిల్లాలో నెట్టెంపాడు, జూరాల ప్రాజెక్ట్ పరిధిలోని పునరావాస కేంద్రాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్లో ఇరిగేషన్, పీజేపీ అధికారులతో పునరావాస కేంద్రాల పై ఏర్పాటు చేసిన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఆలూరు, ర్యాలంపాడు, చిన్నోనిపల్లి, ఉప్పేరు, గార్లపాడు, నాగర్ దొడ్డి, రేవులపల్లి, నెట్టెంపాడు గ్రామాలలో నిర్మాణంలో ఉన్న పునరావాస కేంద్రాల పెండింగ్ పనులు ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలన్నారు. పునరావాస కేంద్రాలలో నిర్వాసితులకు అన్ని వసతులు కల్పించే విధంగా అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు.
పునరావాస కేంద్రాలకు సంబంధించిన టెండర్లు, సర్వే పనులు ఎంత వరకు వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పునరావాస కేంద్రాల కోసం స్థలాన్ని గుర్తించి టెండర్లు, సర్వే ప్రారంభించాలని, ఎస్టిమేషన్ పెండింగ్ ఉంటే పూర్తి చేసి ఎస్టిమేషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాలలో తాగునీరు, పాఠశాలలు, విద్యుత్ ,రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, గ్రామ పంచాయతీ బిల్డింగ్, కమ్యూనిటీ హాలుల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
సమావేశంలో ఆర్డీవో రాములు, శ్రీనివాస్ రావు, ఎస్ఈ, రహీముద్దీన్, జుబేర్ అహ్మద్, విజయ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.