గద్వాల, జూన్ 18 : జిల్లా దవాఖానలో పనిచేస్తున్న 14మంది వైద్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయగా వారితోపాటు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఫార్మసిస్ట్‌పై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేసిన ఘటన జిల్లా దవాఖానలో చోటు చేసుకున్నది. మంగళవారం జిల్లా ప్రభుత్వ దవాఖానను కలెక్టర్ సంతోష్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలోని ప్రతి వార్డును పరిశీలించి అక్కడి పరిస్థితులు, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. దవాఖానలో ఎంత మంది డాక్టర్లు నిర్ధేశిత సమయానికి వచ్చారు అనే అంశంపై రిజిస్టర్‌ను పరిశీలించగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు 14మందితోపాటు మరో నలుగురు వైద్య సిబ్బంది గైర్హాజరు కావడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ వైద్య సిబ్బంది హాజరు వివరాలను తెలిపే బయోమెట్రిక్‌లో వారి వివరాలను ప్రింట్ తీసి ఇవ్వాలని, అదేవిధంగా విధులను సరిగా నిర్వహించని 14మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఫార్మసిస్టు స్టోర్ తనిఖీ చేసి స్టాక్ వివరాలు, రిజిస్టర్లు సరిగా నిర్వహించక పోవడంతో ఫార్మసిస్టును వెంటనే సస్పెండ్ చేయాలని సూపరింటెండెంట్‌కు సూచించారు. అనంతరం కంటి వైద్య చికిత్సకు సంబంధించిన ల్యాబ్‌ను పరిశీలించి కంటి సమస్యలతో వచ్చే రోగులకు వెంటనే మెరుగైన చికిత్సలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్యులకు చెప్పారు. ఆపరేషన్ థియేటర్‌ను జూలై 1నుంచి పని చేసేలా చర్యలు చేపట్టాలని, 50 పడకల వార్డులో పేషెంట్లను షిఫ్ట్ చేసి దానిని వినియోగంలోకి తీసుకురావాలన్నారు. అంతకుముందు దవాఖానకు వచ్చే ఇన్, అవుట్ పేషెంట్ నమోదు వివరాలు తెలిపే రికార్డులను కూడా పరిశీలించారు. కలెక్టర్ వెంట ఇన్చార్జి సూపరింటెండెంట్ నవీన్‌క్రాంతి తదితరులు ఉన్నారు.