గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా (Gadwal ) ఎస్ఈ తిరుపతిరావుపై సస్పెన్షన్ వేటుపడింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు, రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనందుకుగాను ఆయనపై చర్యలు తీసుకుంటూ టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ధరూర్ మండలంలోని అల్వాలపాడు సబ్ స్టేషన్ వద్ద బుధవారం కరెంటు కోతలకు నిరసనగా రైతులు ఆందోళన నిర్వహించారు. జూరాల ప్రాజెక్టు నుంచి కాలువలకు నీళ్లు వదులుతున్నప్పటికీ కరెంటు కోతల కారణంగా మోటార్ల ద్వారా నీటిని పంటలకు సరఫరా చేయలేకపోతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కరెంటు కోతలతో సకాలంలో నీరంధించక పంటలు ఎండిపోతున్నాయని, ఫలితంగా తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు రైతులు తెలిపారు.
విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. దీంతో గురువారం పలువురు అధికారులు ధరూర్ మండలంలో ఈ ఘటనపై విచారణ జరిపారు. రైతులు ఇబ్బందులను పరిష్కరించడంలో విఫలమైన సంబంధిత అధికారులపై చర్యలకు సీఎండీ ఆదేశించడంతో ఎస్ఈ తిరుపతిరావును విధుల నుంచి తప్పించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు గద్వాలకు వనపర్తి జిల్లా ఎస్ఈ రాజశేఖరమ్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.. రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులు వెలువరించినట్లు తెలిసింది.