ఎంజీకేఎల్ఐ నీరు విడుదల
చివరి దశ పంటలకు ప్రాణం
పక్షం కిందట నిలిచిన నీటి విడుదల
ఎమ్మెల్యే మర్రి సూచనతో తిరిగి ప్రారంభం
కోయిల్‌సాగర్ నుంచి ప్రారంభమైన నీటి విడుదల
నాగర్‌కర్నూల్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): యాసంగి పంటలకు ఊతం లభించింది. ఎంజీకేఎల్ఐ నీటిని తిరిగి విడుదల చేయడంతో ఎండిపోయే దశలో ఉన్న పంటలకు ఊపిరి వచ్చింది. ఈ సీజన్లో నాగర్‌కర్నూల్ జిల్లాలో 1.39 లక్షల ఎకరాల్లో వరి, వేరుశనగతో పాటు వివిధ రకాల పంటలు సాగయ్యాయి. శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టు కావడంతో ఎంజీకేఎల్‌ఐకి నీటి సమస్య ఏర్పడింది. కొల్లాపూర్ సమీపంలోని కోతిగుండు వద్ద నీటి లభ్యత బాగా తగ్గింది. ఈ తరుణంలో పక్షం కిందట అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు. సాగునీటికి కొద్దిగా ఇబ్బందులు ఏర్పడగా.. ఈ విషయాన్ని రైతులు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడగా.. జొన్నలబొగుడ రిజర్వాయర్ నుంచి నీటి విడుదల చేశారు. అలాగే కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ప్రారంభమైంది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
యాసంగి పంటలకు ఊరట లభించింది. ఎంజీకేఎల్ఐ నీటిని విడుదల చేయడంతో ఎండిపోతున్న పంటలకు కొత్త ఊపిరి వచ్చింది. యాసంగి సీజన్లో వరి, వేరుశనగతోపాటు పలు పంటలు చివరి దశలో ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈ సీజన్లో 1.39లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఎంజీకేఎల్ఐ ద్వారా విడుదలైన నీళ్లతో చెరువులు, కుంటలు నిండాయి. దీంతో పంటలు చేతికి వచ్చే దశకు చేరుకున్నాయి. ఎంజీకేఎల్ఐ శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టు కావడంతో నీటి సమస్య ఏర్పడింది. ఏపీలో అధికంగా విద్యుత్ ఉత్పత్తి, ఎండాకాలం కావడం, జూరాల నుంచి వరదలు లేకపోవడంతో ఎంజీకేఎల్‌ఐకి కోతిగుండు వద్ద నీటి లభ్యత బాగా తగ్గింది. దీనికితోడు ఈ వేసవిలో తాగునీటి కోసం నీళ్లు కావాల్సి ఉంది. మిషన్ భగీరథ పథకం ద్వారానే జిల్లాతో పాటుగా హైదరాబాద్‌కూ తాగునీరు సరఫరా అవుతున్నది. ఈ కారణంగా ప్రాజెక్టు ద్వారా నీటి విడుదలను దాదాపు పక్షం కిందట ఆపివేశారు. దీంతో చెరువులు, కుంటలు, బావులకు దూరంగా కాల్వలపై ఆధారపడిన కొన్ని ప్రాంతాల రైతులకు సాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ విషయం రైతులు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడారు. ఆయకట్టు పరిధిలోని కాల్వల కింద ఉన్న ప్రాంతాలకు నీటి విడుదలకు ఆదేశించారు. ఎమ్మెల్యే మర్రి సూచనతో అధికారులు జొన్నలబొగుడ ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ప్రాజెక్టు ఎస్ఈ సత్యనారాయణ రెడ్డిని వివరణ కోరగా ఎమ్మెల్యే సూచనతో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు నీటిని విడుదల చేశామన్నారు. దాదాపు నాలుగైదు రోజులు నీటిని విడుదల చేస్తామన్నారు. రైతులు నీటిని వృథా చేయకుండా పంటలకు మళ్లించుకోవాలన్నారు.
కోయిల్‌సాగర్ నుంచి..
దేవరకద్ర రూరల్, మార్చి 13: దేవరకద్ర మండలంలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్‌సాగర్‌లో ఆదివారం సాయంకాలం వరకు అందిన సమాచారం మేరకు 25.8అడుగుల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 32.6 (2.27 టీఎంసీలు), కాగా ప్రస్తుతం 25.8 అడుగులు వద్ద ఉందన్నారు. కలెక్టర్, నీటి పారుదల శాఖ అధికారుల ఆదేశాల ప్రకారం ఎడమ కాల్వ ఆయకట్టుకు గతంలో మూడు విడుతలు నీటిని విడుదల చేయగా, నాల్గో విడుత ఆదివారం నుంచి విడుదల చేసినట్లు వెల్లడించారు. నారాయణపేట, మద్దూర్, కొడంగల్ మండలాలకు తాగునీటి అవసరాలకు 10క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
రైతుల హర్షం
నాగర్‌కర్నూల్ టౌన్/బిజినేపల్లి/తాడూరు, మార్చి 13: మండలంలోని యాసంగి సీజన్లో వరి, మొక్కజొన్న, వేరుశనగ పంటలను రైతులు సాగు చేశారు. కొన్నిరోజులుగా ఎంజీకేఎల్ఐ నుంచి నీరు నిలిపివేయడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. రైతుల ఇబ్బంది దృష్ట్యా ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి నీటి విడుదలకు అధికారులకు సూచనలు చేయడంతో ఆదివారం విడుదల చేశారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు అల్లీపూర్ గ్రామంలో, తాడూరు మండలంలో కాల్వలను టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఎంజీకేఎల్ఐ నీటి విడుదలపై జెడ్పీటీసీ శ్రీశైలం, టీఆర్ఎస్ సీనియర్ దొడ్ల ఈశ్వర్‌రెడ్డి, రైతు సంఘం మండలాధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు.