అలంపూర్ : రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో అఖిపలక్ష నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు వ్యతిరేకంగా విషపూరితమైన ఇథనాల్ ఫ్యాక్టరీ చేపట్టాలనే ప్రభుత్వ కుట్ర పూరిత ఆలోచన మానుకోవాలని అఖిల పక్షం నాయకులు, ప్రజలు కంపెనీ నిర్మాణానికి వ్యతిరేకంగా గత సంవత్సర కాలంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. సోమవారం రాత్రి యుద్ధానికి ప్రైవేట్ సైన్యంతో వచ్చినట్టు ఇథనాల్ యాజమాన్యం ఫ్యాక్టరీ నిర్మించడానికి పూనుకున్నది. దీన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.
బుధవారం కూడా గ్రామాలన్నీ ఊరు, వాడ కదిలి నిరసన చేపడుతున్నాయని తెలిసిన పోలీసు యంత్రాంగం బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు. అలాగే గద్వాలలో బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కురవ పల్లెయ్యను, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకటరాములను అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులతో ప్రజల ఉద్యమాన్ని ఆపలేరని వారు స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో విషపూరితమైన ఫ్యాక్టరీని నిర్మించకుండగా చూడాలని కోరారు. లేదంటే ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.