ఐజ: జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలంలో కలెక్టరేట్‌కు వెళ్లకుండా రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. గురువారం ఉదయం సీడ్ ఆర్గనైజర్లు, కంపెనీ ప్రతినిధులు, రైతులతో జిల్లా అధికారులు కలెక్టరేట్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తమ గోడు వెళ్లబోసుకునేందుకు కలెక్టర్ కార్యాలయానికి వెళ్తున్న అన్నదాతలు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాసంఘాల నేతలను గ్రామాల్లోనే అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బుధవారం జిల్లా ఐజ మండలం బింగి దొడ్డి గ్రామ స్టేజీ వద్ద సీడ్ రైతులు సుమారు 5 గంటల పాటు ధర్నా చేశారు. దీంతో ఘటనా స్థలానికి వచ్చిన గద్వాల డీఎస్పీ మొగిలయ్య చేరుకొని రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసిన ఫలితం ఫలించలేదు. చివరకు జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ.. జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయన్ ఫోన్లో సంప్రదించారు. గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో సీడ్ ఆర్గనైజర్లు, కంపెనీ ప్రతినిధులు, రైతులతో సమావేశం ఏర్పాటుచేసి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ధర్నా విరమించారు. ఈ నేపథ్యంలో గురువారం కలెక్టరేట్‌కు వెళ్తున్న రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు.