నాగర్‌కర్నూల్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం వైఖరితో వంటింట్లో మంటలను రేగుతున్నాయి. మహిళలను వంటింటి కష్టాల నుంచి తప్పించేందుకు సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్నది. దీంతో పొగ తగ్గి పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలనేది కూడా ఓ విధానం. ఇలాంటి పథకం ఇప్పుడు సామాన్యులకు గుదిబండగా మారుతున్నది. కేంద్ర ప్రభుత్వం సిలిండర్ల ధరలను వరుసగా పెంచుతూ వస్తున్నది. గత ఆగస్టులో ఒక్కో సిలిండర్ ధరను రూ.25 చొప్పున పెంచింది.
ఇది మరవక ముందే తాజాగా మరో రూ.25 చొప్పున పెంచడం గమనార్హం. ఈ పెంపుదలతో సామాన్యులు సిలిండర్లను కొనలేని పరిస్థితి ఏర్పడుతున్నది. సిలిండర్లపై సబ్సిడీ ఇస్తున్నా పెంచిన ధరలతో ఏ మాత్రం సంబంధం ఉండడం లేదు. ఏడాది వ్యవధిలోనే ఇప్పటి వరకు ఐదుసార్లు సిలిండర్ల ధరలను పెంచింది. గతేడాది డిసెంబర్లో ఓసారి సిలిండర్ ధర ఏకంగా రూ.100 పెంచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.50 మేర పెంచింది. మార్చిలో రూ.75, జూలైలో రూ.25 చొప్పున పెరిగాయి. తాజాగా మళ్లీ రూ.25 మేర పెరిగాయి. ఏప్రిల్‌లో మాత్రం రూ.10 చొప్పున తగ్గించింది. దీన్ని బట్టి గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఒక్క సిలిండర్‌పై రూ.265 చొప్పున పెరిగింది. వరుసగా పెరుగుతున్న సిలిండర్ల ధరలు సామాన్యులపై పెనుభారాన్ని మోపుతున్నాయి.
సాధారణ గృహావసరాలతోపాటు చిరు వ్యాపారాలు చేసుకునే టిఫిన్, చికెన్ సెంటర్లు, ఇతర వ్యాపారస్తులకు భారంగా మారుతున్నది. పెరుగుతున్న ధరలతో తినుబండారాలు, టిఫిన్లు, హోటళ్లలో భోజనాల ధరలపై కూడా ప్రభావం పడుతున్నది. ఇటీవల టిఫిన్లకు రూ.5మేర, భోజనాలకు రూ.10మేర పెంచారు. దీనికి లాక్డౌన్ పరిస్థితులు కూడా కారణం అని చెప్పొచ్చు. అయితే ఇలా ఓవైపు సిలిండర్ల ధరలు పెరుగుతున్నా సబ్సిడీ మాత్రం ఆ స్థాయిలో పెరగడం లేదు. ఇక సిలిండర్లు సరఫరా చేసే ఏజెన్సీలు రవాణా సమయంలో అనధికారికంగా రూ.20 చొప్పున వసూళ్లు చేస్తున్నారు. పెరుగుతున్న ధరలను బట్టి రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా ఎత్తేసే అవకాశం ఉందని పేదలు ఆందోళన చెందుతున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో దీపం పథకం కింద 61,255 కనెక్షన్లు, ఉజ్వల యోజన పథకం కింద 34,466 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. ఇలా జిల్లాలో మొత్తం 2,45,958 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. పెరిగిన ధరలతో జిల్లాలో గ్యాస్ సిలిండర్ల లబ్ధిదారులపై అదనంగా రూ.61 లక్షల మేర భారం పడుతున్నది. జిల్లాలో ఇంతకు ముందు ఒక్క సిలిండర్ ధర రూ.905 ఉండగా ఇప్పుడు రూ.930కి చేరుకున్నది. ఇందులో సబ్సిడీ కేవలం రూ.45 మాత్రమే ఉండడం గమనార్హం. ప్రతి నెలా ఇలా పెరుగుతున్న ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.