గద్వాల: ముస్లింలకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వక్ఫ్ బోర్డ్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గద్వాల (Gadwal) పట్టణంలో ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు. ధరూర్ మెట్లోని దర్గా నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది.
వక్ఫ్ బోర్డ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సరిత, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్కేశవ్, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు చెందిన ఆస్తులను దోచుకునేందుకు కొత్త చట్టాలను తీసుకువచ్చిందని విమర్శించారు. చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిని యావత్ జాతిపై దాడిగా గుర్తించి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.