గద్వాల్ రూరల్,ఏప్రిల్02 : ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన విషాదకర సంఘటన వీరాపురంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గద్వాల పట్టణ పరిధిలోని వెంకటోనీ పల్లి గ్రామానికి చెందిన నవీన్(30) బుధవారం మండల పరిధిలోని వీరాపురం దగ్గర ఉన్న ఎస్సార్ విద్యానికేతన్ పాఠశాల దగ్గర సెంట్రింగ్ పనిచేస్తున్నాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు మీదపడి నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఘటన స్థలానికి కుటుంబ సభ్యులు చేరుకొని పాఠశాల యాజమాన్యంతో వాగ్వివాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను శాంతింపజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి నరసింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గద్వాల రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.